పారాహుషార్.. చైనా మరో బయోవార్‌..?

By మధుసూదనరావు రామదుర్గం  Published on  11 Aug 2020 11:12 AM IST
పారాహుషార్.. చైనా మరో బయోవార్‌..?

కరోనా దెబ్బకు విలవిల్లాడిపోతున్న దేశాలకు మరో ఉపద్రవం విత్తనాల రూపంగా ముంచుకొస్తోంది. గత కొన్ని రోజులుగా అమెరికా, కెనడా, జపాన్, బ్రిటన్‌ తదితర దేశాల్లో చైనా పేరిట అనుమానాస్పద విష విత్తనాల ప్యాకెట్లు వచ్చిపడుతున్నాయి. దేశంలో పౌరుల పేరిట వస్తున్న ఈ విత్తనాలు కలకలం రేపుతున్నాయి. వ్యవసాయ జీవవైవిధ్యానికి, ఆహార భద్రతకు ముప్పుతెచ్చే విలన్‌ ఆలోచనలతోనే చైనా ఈ దుర్మార్గానికి తెగబడిందని ఆందోళన నెలకొంది. ఇప్పటికే కరోనా వ్యాప్తిలో దుష్టపాత్ర పోషించిందని ప్రపంచ దేశాలు తిట్టిపోస్తుంటే.. మరో వివాదానికి తెరలేయడం కలవరం కలిగించే విషయమే! ముఖ్యంగా వ్యవసాయాధారితమైన భారత్‌కు

కరోనా విపత్తుకు మూల కారణం చైనాయేనని చాలా దేశాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ దేశాలు ఈ విషయంగా చాలా గుర్రుగా ఉన్నాయి. అమెరికా విషయం చెప్పక్కర్లేదు. అధ్యక్షుడు ట్రంప్‌ ఏ చిన్న అవకాశం దొరికినా సరే చైనాపై విరుచుకు పడుతున్నాడు. తమ దేశప్రజలు లక్షల్లో మరణించడాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నారు. అసలు ఇది ఇంత ఘోర విపత్తని చైనా ముందస్తుగా ఎందుకు ప్రపంచదేశాలకు చెప్పలేకపోయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే చైనా దిగుమతులు, యాప్‌లను భారతదేశంతో సహా పలు దేశాలు నిషేధించాయి. అమెరికా ఏకంగా తమ దేశంలోనిచైనా కాన్సులేట్‌ను మూసేసుకు పొమ్మని చైనాకు ఆర్డరేసింది. ఈ వ్యవహారంలో చైనా తమ తప్పేం లేదని మొదట్లో తీవ్రంగా వాదించాలని ప్రయత్నించినా.. బలపరిచే వారు కరవవడంతో మిన్నకుండిపోయింది.

పలు దేశాలు చైనా పేరిట విత్తనాల ప్యాకెట్లు రావడంతో హడలిపోతున్నాయి. పైగా వ్యక్తుల పేర్లపై వచ్చిపడుతున్న ఈ ప్యాకెట్లను ఎవరూ తీసుకోరాదని ఆయా దేశాలు హెచ్చరిస్తున్నాయి. విత్తనాలే కదా అని సరదాగా పెరట్లోనో.. పొలాల్లోనూ విత్తితే ఉత్పాతం మొదలైనట్లేనని చెబుతున్నాయి. ఎవరికి అలాంటి విత్తనాల ప్యాకెట్లు వచ్చినా వెంటనే ప్రభుత్వదృష్టికో పోలీసులకో తెలపాలని ఉత్తర్వులు జారీ చేశాయి. చైనా ఇదంతా కేవలం పుకార్లే మేమెందుకలా చేస్తామని చెబుతున్నా.. తన వంకర బుద్ది తెలిసిన వారు ...వారి జాగ్రత్తలో వారుంటున్నారు. అసలు ప్యాకెట్లపై చైనా పేరు ఎందుకు ఉందో అన్న ప్రశ్నకు చైనా వద్ద సమాధానం లేదనే చెప్పాలి. అందుకే ఇది కచ్చితంగా చైనా చేస్తున్న పనే అని పశ్చిమ దేశాలు మండిపడుతున్నాయి.

ఇంతటి విపత్తుతో ప్రపంచ ప్రజలు అల్లాడిపోతుంటే.. చైనా మాత్రం పలు విషయాల్లో తన వింత పోకడను బైటపెట్టుకుంటునే ఉంది. మొన్నటి మొన్న మన దేశ సరిహద్దు లద్దాఖ్‌ వద్ద అనవసరంగా తన సైన్యాలను భారీగా మోహరించింది. అప్పట్లో జరిగిన ఘర్షణలో మనే సైనికులు కొందరు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. చైనా దుష్టబుద్ధిని భారత్‌ ప్రపంచదేశాల ముంగిట నిశితంగా విమర్శించింది. ఇది చాలదూ అన్నట్టు మన పొరుగు దేశం పాకిస్తాన్‌ కశ్మీర్‌ విషయంలో రచ్చచేస్తుంటే.. ఉచిత సలహాలివ్వడానికి చైనా నేనున్నానంటూ ముందుకొచ్చింది. ఈ దశలో ఇది మా అంతర్గత వ్యవహారం తమరి సలహాలు అక్కర్లేదంటూ మనదేశం ఘాటుగానే స్పందించింది.

ఈ నేపథ్యంలో భారత వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ ఈ మధ్య ప్రజలకు ముందస్తు జాగ్రత్తగా అప్రమత్తం చేసింది. అనుమానాస్పద విత్తనాలు విషపూరితాలై ఉండవచ్చని, వైరస్‌లు బ్యాక్టీరియాలతో పంటలు ఘోరంగా దెబ్బతినవచ్చని హెచ్చరిస్తోంది. విషమయంగా ఉన్న కలుపు మొక్కల విత్తనాలూ ఉండవచ్చని అంటున్నాయి. వీటివల్ల వ్యవసాయంతోపాటు పర్యావరణం దెబ్బతినే ప్రమాదం వాటిల్లవచ్చని కేంద్ర వ్యవసాయశాఖ అంటోంది. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ కేంద్ర వ్యవసాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌ శ్రీవాస్తవ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, విత్తనాభివృద్ధి సంస్థలకూ లేఖ రాశారు. అయితే ఇప్పటి వరకు మనదేశంలో ఎవరికీ ఇలాంటి అనుమానిత విత్తన ప్యాకెట్లు వచ్చినట్లు సమాచారం లేదు.

అంతర్జాతీయ విత్తన పరీక్ష సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్‌ కేశవులు ముందుగానే మేల్కొని కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. దేశవిదేశాల నుంచి వచ్చేస్తున్న విత్తనాలు, చీడపీడలు ఇక్కడి జీవవైవిధ్యాన్ని ధ్వంసం చేస్తాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌ పోర్టులు, పోర్టుల్లో ని విత్తన క్వారంటెయిన్‌ యంత్రాంగం ఈ విషయంగా మరింత జాగరూకతతో వ్యవహరించాలని కోరుతున్నారు.

చైనా నుంచి మొదట విదేశాల్లో కరోనా ప్రబలి ఆ తర్వాత మనదేశంలో విజృం భిస్తున్నట్టే ఈ విత్తనాలు కూడా మరో విధ్వంసానికి దారితీసే ప్రమాదం లేకపోలేదు. ఈ కరోనా అనేది రాకుండా ఉంటే.. ఈ వ్యవహారం దేశ ప్రజల దృష్టికి వచ్చేది కాదు...వచ్చినా ఇంత స్పందన ఉండేది కాదేమో! కానీ కరోనా పుణ్యమా అని అన్ని దేశాలు ప్రతి చిన్నవిషయంలోనూ కీడెంచి మేలెంచు అనే రీతిలో వ్యవహరిస్తున్నాయి. అసలే మనదేశం వ్యవసాయ ప్రధాన దేశం. ఇప్పటికే మన రైతులు ఎరువులు, పురుగుల మందు, నాసిరకం విత్తనాల విషయంగా దెబ్బతింటూనే ఉన్నారు. మరో విష విత్తన ఉత్పాతం ముంచెత్తితే సాగుదెబ్బతినడమే కాదు ఏకంగా జాతీయ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. అందుకే వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతుల్ని పారాహుషార్‌ అంటున్నారు.

Next Story