వీడుతున్న కంటైనర్ మృతుల మిస్టరీ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Oct 2019 5:21 AM GMT
వీడుతున్న కంటైనర్ మృతుల మిస్టరీ..!

యూకేలోని కంటైనర్ లోని 39 మృతదేహాల మిస్టరీ వీడుతోంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ వారిని మళ్ళీ బెయిల్ పై రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే...మరోవైపు ఇది ఒక లారీ కాదని వరుసగా మూడు కంటైనర్లు వందమంది వ్యక్తులను రవాణా చేస్తున్నాయని మృతుల బంధువులు చెబుతున్నారు. అటు పోలీసులు కూడా 2 వాహనాలు తమ ట్రిప్ లను ముగించుకుని ఉంటాయని, మూడో వాహనం ఇలా లభించి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈవిధంగా గతంలో మైగ్రేట్ అయినవారికి ఏదైనా సమాచారం ఉంటే తమకు తెలుపవలసిందిగా పోలీసులు కోరుతున్నారు. సమాచారాన్ని అందించిన వారిపై ఎటువంటి కేసులు లేకుండా చూసుకుంటామని..పోలీసులు హామీ ఇస్తున్నారు.

ఇక కంటైనర్‌లో ఉన్న 39 మంది మృతులలో ఆరు మృతదేహాలు వియత్నాంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరిలో ఒక మహిళ కథ అందర్నీ కన్నీరు పెట్టిస్తోంది. 26 ఏళ్ల ఫామ్ థీ ట్రా అనే యువతి మెరుగైన జీవితం కోసం బ్రిటన్ వెళ్లే ప్రయత్నంలో మొదట చైనాకు వెళ్లింది. అనంతరం ఫ్రాన్స్ కు వెళ్ళింది. అయితే బ్రిటన్ వెళ్లడానికి ఆమె ఏజెంట్లకు కొన్ని వేల పౌండ్లు చెల్లించింది. కానీ ఆ ప్రయాణం మధ్యలో ఆమె తల్లిదండ్రులకు ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించింది. 'తనకి ప్రయాణం ఎంతో కష్టంగా ఉందనీ.. శ్వాస తీసుకోలేక పోతున్నానని' ఉంది ఆ మెసేజ్ లో. అలాగే ఒక యువకుని కథ కూడా అలాంటిదే..

అయితే మృతులందరూ చైనీయులని మొదట పోలీసులు భావించారు. కానీ..కొంతమంది వియత్నాం వాసులు.. మృతులు తమ వారేమో అన్న అనుమానంతో పోలీసులను సంప్రదించారు. ఇప్పటికీ ఇంకా కొందరు వ్యక్తులకు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియలేదు. బెల్జియం లోని ఒక పోర్టు కు వచ్చిన కంటైనర్ లో వీరంతా ఉండి ఉండొచ్చని, తర్వాత దాని మీద లారీ కంటైనర్ కు అమర్చి మరో ప్రాంతానికి తరలించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

అయితే ఇందులో ఉన్న వారు.. చివరి క్షణాల్లో నరకం అనుభవించారని తెలుస్తోంది. కోల్డ్ కంటైనర్‌లో 23 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతను ఉంది. దీంతో వారంతా చలిని తట్టుకోలేక పోయారని, ఒకే కంటైనర్‌లో అంత మంది ఉండటం వల్ల శ్వాస తీసుకోవడం కష్టమయి ఉండవచ్చని ప్రాథమిక అంచనా. ఈ కంటైనర్ తలుపులకు రక్తపు మరకలు ఉన్నాయని, బాధితులు తమని రక్షించాలని కోరుతూ తలుపు కొట్టి ఉంటారని కొన్ని పత్రికలు వెబ్సైట్లు పేర్కొన్నాయి. అయితే ఈ కంటైనర్ భద్రతా వలయాన్ని దాటుకుని అంత సులభంగా ఎలా చేరిందనేది... ఇంకా చిక్కుప్రశ్న గానే మిగిలిఉంది.

Next Story