నేడు జాతీయ కౌగిలింత‌ల దినోత్స‌వం.. చ‌రిత్ర‌, ప్రాముఖ్య‌త‌, ఇంకా

Why do Celebrate National Hugging Day on January 21.ఏడుస్తున్న పాపాయిని గుండెల్లో పొదువుకున్న అమ్మ కౌగిలింతకి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jan 2023 3:39 AM GMT
నేడు జాతీయ కౌగిలింత‌ల దినోత్స‌వం.. చ‌రిత్ర‌, ప్రాముఖ్య‌త‌, ఇంకా

ఏడుస్తున్న పాపాయిని గుండెల్లో పొదువుకున్న అమ్మ కౌగిలింతకి మించిన లాలన లేదు. ర్యాగింగ్‌ భయంతో వణుకుతున్న అమ్మాయిని భుజం తట్టి గుండెల్లో దాచుకున్న తండ్రి కౌగిలింతకి మించిన భరోసా లేదు. ప్రమాదంలో గాయపడ్డ స్నేహితుడిని ఆర్తిగా చుట్టేసిన మిత్రుడి కౌగిలింతకి మించిన ఓదార్పు లేదు. తనకు వంశాకురాన్ని అందించిన అర్ధాంగిని నిలువెల్లా హత్తుకున్న భర్త కౌగిలింతకు మించిన ప్రేమ లేదు.

కౌగిలింత అంటే ఓ లాలన, భరోసా, ప్రశంస, ప్రేమ. కౌగిలించుకోవడమంటే ‘నువ్వు నాకు ఎంతో ముఖ్యం, చాలా ఇష్టం’ అని మౌనంగా చెప్పడం. ఈ రోజు ప్ర‌పంచ కౌగిలింత‌ల దినోత్స‌వం. అవును మీరు చ‌దివింది నిజ‌మే. చిల్డ్రన్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, లవర్స్ డే లాగానే ఇది ఓ రోజు.

ప్రతి సంవత్సరం జనవరి 21ని నేషనల్ హగ్గింగ్ డేగా జరుపుకుంటారు. కౌగిలించుకోవడం వల్ల మనుషుల మధ్య దూరం త‌గ్గుతుంద‌ని నమ్ముతారు. ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మరియు దానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

నేషనల్ హగ్గింగ్ డేని 1986 సంవత్సరంలో కెవిన్ జాబోర్నీ ప్రారంభించారు. దీనిని జనవరి 21న జరుపుకుంటారు. ఇలాంటి కార్యక్రమం ప్రజలలో ద్వేషం త‌గ్గించి, ఆప్యాయంగా ఉండేలా ప్రోత్సహిస్తుందని ఆయన భావించారు. అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలోని క్లియో నగరంలో తొలిసారిగా ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు. కెవిన్ జాబోర్నీ అమెరికన్ ప్ర‌జ‌లు బహిరంగంగా భావోద్వేగాలను ప్రదర్శించడానికి సిగ్గుపడుతున్నార‌ని అని గమనించాడు. అందువల్ల జాతీయ హగ్గింగ్ డే ప్రజలలో మరింత ప్రేమను తీసుకురావడం ద్వారా దీనిని మారుస్తుందని అతను ఆశించాడు.

క్ర‌మంగా దీన్ని ఆస్ట్రేలియా, కెన‌డా, ఇంగ్లాండ్‌, జ‌ర్మ‌నీ వంటి దేశాల్లో దీన్ని జ‌రుపుకుంటున్నారు. ఎన్నో సంవ‌త్స‌రాలుగా ఈ సంప్ర‌దాయం చాలా దేశాల్లో కొన‌సాగుతోంది. ఇక్క‌డ ఇంకో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే కొన్ని దేశాల్లో ఈ రోజును ప‌బ్లిక్ హాలీడేగా ప్ర‌క‌టించారు.

కౌగిలింత ఓ చక్కటి అనుభూతి అనేది శాస్త్రవేత్తల అబిప్రాయం కూడా. మ‌నం అమితంగా అభిమానించే వారిని, ప్రేమించేవారిని కౌగలించుకుంటే మానసిక ఒత్తిడి తగ్గిపోతుందని చెబుతుంటారు. మెద‌డు ప్ర‌శాంతంగా ప‌ని చేయ‌డానికి ఇది తోడ్ప‌డుతుంది. కౌగిలింత ఓ మ్యాజిక్‌లా ప‌ని చేస్తుంద‌ని ఇలా చేసిన వారు అంటున్నారు.

కౌగిలించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

కౌగిలింతలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆందోళనను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడి, రక్తపోటు తగ్గుతాయి. కౌగిలింత నాడీ వ్యవస్థపై ఎంత ప్రభావం చూపుతుంది అంటే భయం పారిపోతుంది. ఏదైనా చెప్పే బదులు, కౌగిలింత మంచి మార్గంలో చాలా విషయాలను తెలియజేస్తుంది. కాబట్టి, మీ ప్రియమైన వారిని కౌగిలించుకోండి.

Next Story