ఊపు, ఉత్సాహం మీదున్న గులాబీ క్యాడర్లు, లీడర్లు

TRS leaders In Full Josh.ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి దసరా పండుగ రోజున జాతీయ పార్టీగా మారబోతోంది.

By Nellutla Kavitha  Published on  4 Oct 2022 6:01 PM IST
ఊపు, ఉత్సాహం మీదున్న గులాబీ క్యాడర్లు, లీడర్లు

తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ. రాష్ట్రంలో జరుపుకొనే అతి పెద్ద పండుగ దసరా. ఆ రోజుకి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ పండుగ కోసం గులాబీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. తమ పార్టీ అధినేత చేసే ప్రకటన తమకు మరింత ఊపునిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటిదాకా ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి దసరా పండుగ రోజున జాతీయ పార్టీగా మారబోతోంది. విజయదశమి రోజు జాతీయ పార్టీ ప్రకటనతో ఇక తమకు అంతా విజయాలే సొంతమవుతాయి గులాబీ పార్టీ లీడర్లు, కేడర్లు ఉత్సాహంతో ఊగిపోతున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజయదశమినాడు, బుధవారం రోజు జాతీయ పార్టీ పెట్టబోతున్నారు. పెద్ద పండుగ రోజు కెసిఆర్ జాతీయ పార్టీ ప్రకటనతో గల్లీ నుంచి లండన్ వీధుల వరకు టిఆర్ఎస్ కార్యకర్తలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన టిఆర్ఎస్ లీడర్ రాజనాల శ్రీహరి లిక్కర్ బాటిల్స్ ను, చికెన్ ను స్థానికులకు పంచుతున్నారు. ఈ వీడియోని ANI షేర్ చేసింది.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కూర్మాచలంతో పాటు పలువురు ఎన్నారైలు చారిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జి దగ్గర కెసిఆర్ భారీ కటౌట్లను ఏర్పాటు చేసి, దేశ్ కా నేత కెసిఆర్ అంటూ జాతీయ పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.


తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చుతూ దసరా రోజు తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో తీర్మానిస్తారు. మర్నాడు దానిని ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పిస్తారు. ఎన్నికల సంఘం దానిని ఆమోదించడానికి కొంత సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.


మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూలు విడుదలైనా, దసరా రోజున సర్వసభ్య సమావేశం యథావిథిగా ఉంటుందని కేసీఆర్‌ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. జాతీయ పార్టీ ఏర్పాటు చేసినా వచ్చే నెలలో జరిగే మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ తరఫునే అభ్యర్థి బరిలో ఉంటారని తెలుస్తోంది. దీనికి కారణం పార్టీ పేరు మార్పు ప్రక్రియ నామినేషన్ల నాటికి పూర్తికాదని, కనీసం నెల రోజులు పట్టవచ్చని నేతలు అంటున్నారు. అందుకే టీఆర్‌ఎస్‌ అభ్యర్థినే పోటీకి దించుతామని ఆ పార్టీ లీడర్లు తెలిపారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ పోటీలో నిలబడినా, జాతీయ పార్టీగా అన్ని రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టబోతోంది గులాబీ పార్టీ.

రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీకి జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో మద్దతు ఎలా లభిస్తుంది ? సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాల్లో వివక్ష ఎదురైందని, ప్రత్యేక రాష్ట్రం అందుకు ఏకైక పరిష్కారం అంటూ పోరాడిన టిఆర్ఎస్ కు వివిధ రాష్ట్రాల్లో పట్టు ఉందా? ప్రాంతీయ పార్టీ టిఆర్ఎస్ జాతీయ పార్టీ బీఆర్ ఎస్ గా మారినంత మాత్రాన ఎవరెవరు కెసిఆర్తో కలిసి వస్తారు? ఈ అనుమానాలపై పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక గులాబీ నేత కీలకమైనటువంటి సమాచారాన్ని అందించారు. కేసీఆర్‌ ఏర్పాటు చేసే జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడుగుపెట్టనుందని, ఇప్పటికే ఏపీలోని టీడీపీ నేతలను సంప్రదించారని సమాచారం. ఆ రాష్ట్ర టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలు కొందరు తమతో టచ్‌లో ఉన్నారని ఆయన తెలిపారు. కొత్త పార్టీలోకి అనేక చేరికలు ఉంటాయని, ముఖ్యంగా ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో రాజకీయ మార్పులు కూడా ఉంటాయని వారు భావిస్తున్నారు.


ఇప్పటికే కొందరు నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. పార్టీలో చేరి క్రియాశీలంగా ఉండేందుకు ఆసక్తి కనబరిచారని వారు చెబుతున్నారు. జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు అవసరమైన ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాలను గెలుచుకోవడం తమకు పెద్ద కష్టమేమీ కాదని గులాబీ నేతలు ధీమా వ్యక్తంచేశారు. వివిధ రాష్ట్రాల్లో సొంతంగా పోటీ చేయాలనుకుంటున్నా, అక్కడ ఉండే స్థానిక రాజకీయాలు, అప్పటి పరిస్థితులను బట్టి ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు చెపుతున్నారు.


తెలుగు గడ్డపై పుట్టి దేశాన్ని ఏకం చేసిన ఎన్టీఆర్ లాగానే అదే తెలుగు గడ్డపై పుట్టి దేశాన్ని ఏకం చేసేందుకు కేసీఆర్ విజయదశమి రోజునే బిఆర్ఎస్ ను ప్రారంభిస్తున్నారని గులాబీ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులను ఎదుర్కోవడానికి సరికొత్త రాజకీయం కావాలని, అందుకు కేసీఆర్ తీసుకొచ్చే వ్యూహాలు ఉపయోగపడతాయని చెప్తున్నారు గులాబీ నాయకులు. రెండు రోజుల నుంచి ప్రగతిభవన్ లోనే కేసీఆర్ జాతీయ పార్టీ మీద సీరియస్ గానే మంతనాలు సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటుగా, సీనియర్ నేతలు, రాజకీయాల నుంచి దూరంగా ఉన్న వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. విధి, విధానాలు ఎలా ఉండబోతున్నాయి? ఎలాంటి వ్యూహాలు రచించపోతున్నారు? పార్టీలోకి ఎవరెవరిని ఆహ్వానిస్తారు? జండా, ఎజెండా ఎలా ఉండబోతోంది? అన్ని వివరాలు గులాబీ బాస్ రేపు అందించబోతున్నారు.

Next Story