Telangana: అసెంబ్లీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.

By Srikanth Gundamalla  Published on  10 Nov 2023 3:54 PM IST
telangana, election, nomination,  EC,

 Telangana: అసెంబ్లీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల స్వీకరణ గడువు పూర్తయ్యింది. చివరి రోజు కావడంతో..ఆర్డీవో కార్యాలయాల వద్ద కోలాహలం నెలకొంది. పెద్ద ఎత్తున ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు అభ్యర్థులు. కాగా.. ఈ నెల 13న అధికారులు నామినేషన్లను పరిశీలించనున్నారు. ఈనెల 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది.

కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నవంబర్ 9వ తేదీ వరకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో 2,474 నామినేషన్లు దాఖలు అయ్యాయని అధికారులు వెల్లడించారు. ఇక చివరి రోజు అంటే నవంబర్‌ 10వ తేదీ రోజున భారీ ఎత్తున నామినేషన్లు వచ్చాయని తెలుస్తోంది. చివరి రోజున దాదాపు వెయ్యికి పైగా నామినేషన్లు దాఖలై ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా.. నవంబర్‌ 9వ తేదీనే ముఖ్య నాయకులు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఆ తర్వాత ఈ నెల 15 వరకు అభ్యర్థులు తమతమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది.

బీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ రెండు చోట్లా పోటీ చేస్తుండగా.. గజ్వేల్‌లో కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ బరిలోకి దిగారు. ఇక మరో నియోజకవర్గం కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి పోటీగా దిగుతున్నారు. రేవంత్‌రెడ్డి చివరి నిమిషంలో కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేశారు. ఈసారి అత్యధికంగా గజ్వేల్, మేడ్చల్ నియోజకవర్గాల్లో నామినేషన్లు వేశారు. గజ్వేల్‌లో 50, మేడ్చల్‌లో 30 వరకు నామినేషన్లు వేసినట్లు తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు మొత్తంగా 2,644 నామినేషన్లు దాఖలయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం.. ఈసారి నామినేషన్ల సంఖ్యే ఎక్కువే ఉండొచ్చని స్పష్టమవుతోంది.

ఇక ఈ నెల 30న 119 నియోజకవర్గాల్లో ఒకేసారి పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. టీడీపీ, వైఎస్సాఆర్‌టీపీ పోటీ నుంచి తప్పుకున్నాయి. వైఎస్సాఆర్‌టీపీ మాత్రం అధికారికంగా కాంగ్రెస్‌కు మద్దతు తెలిపింది. ఇక కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా సీపీఐ కొత్తగూడెం నుంచి బరిలోకి దిగింది. సీపీఎం మాత్రం ఒంటరిగా పోటీ చేస్తోంది. బీజేపీ, జనసేన కలిసి బరిలోకి దిగాయి. జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. అధికార పార్టీ బీఆర్ఎస్‌ అన్ని చోట్లా పోటీకి దిగిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పడ్డాక జరుగుతున్న మూడో శాసనసభ ఎన్నికల్లో 3.17 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Next Story