యాదాద్రిలో సామాన్య భక్తుల విడిదికి అధునాతన విల్లాలు

Sophisticated villas for common devotee accommodation in Yadadri. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తుల కోసం విడిది కోసం అధునాతన

By అంజి  Published on  13 July 2022 10:24 AM IST
యాదాద్రిలో సామాన్య భక్తుల విడిదికి అధునాతన విల్లాలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తుల కోసం విడిది కోసం అధునాతన కాటేజీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కాటేజీలను వీవీఐపీ, వీఐపీ, దేశ విదేశా నుంచే వచ్చే ముఖ్య అతిథుల కోసం యాదగిరిగుట్ట టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ దాతల సాయంతో ప్రెసిడెన్సియల్ సూట్‌లను నిర్మించింది. వీటిని తాజాగా సామాన్య భక్తులకూ అందుబాటులో ఉంచారు. విల్లాలో సింగిల్‌ బెడ్‌ రూమ్‌కు రోజుకు రూ.3 వేలు, 5 బెడ్‌రూమ్‌లు కలిగిన పూర్తి విల్లాకు రూ.15 వేలు నిర్ణయించారు. దీంతో పాటు భక్తులకు ఆలయ సిబ్బంది చేత ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు.

కొండపై 13.26 ఎకరాల్లో అధునాతన విల్లాలు

ప్రెసిడెన్సియల్‌ సూట్‌లోని కాటేజీలను వైటీడీఏ అధికారులు సాధారణ భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. యాదాద్రీశుడి దర్శనం కోసం వచ్చే భక్తులు రెండు మూడు రోజులు ఇక్కడే ఉండే విధంగా ఆలయ పరిసరాలను తీర్చిదిద్దారు. తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వీఐపీ, వీవీఐపీ భక్తులు వస్తుంటారు. వారి విడిది కోసం యాదాద్రి కొండకు ఉత్తరాన చిన్న కొండపై 13.26 ఎకరాల్లో 14 విల్లాలు, ఒక ప్రెసిడెన్సియల్ సూట్‌ నిర్మించారు. రూ.143.80 కోట్లతో నిర్మాణం చేపట్టగా పనులు పూర్తయ్యాయి. ఇందులో సుమారు రూ.17 కోట్ల వ్యయంతో 15,500 చదరపు అడుగులో ప్రెసిడెన్సియల్‌ సూట్‌ను కొండ శిఖరాగ్రాన నిర్మించారు. ఆ కింది ప్రాంగణంలో నాలుగు విల్లాలు, దిగువన మరో పది విల్లాలు పూర్తయ్యాయి. ఒక్కో విల్లాలో 5 బెడ్రూంలు ఉండగా, 14 విల్లాల్లో మొత్తం 70 బెడ్రూంలు అందుబాటులోకి వచ్చాయి.

విల్లాల ప్రత్యేకతలివే

ఒక్కో విల్లాలో 5 బెడ్‌రూమ్‌లు ఉంటాయి. వాటితో పాటు వెయిటింగ్‌ హాల్‌, డైనింగ్‌ హాల్‌, కిచెన్‌, యాదాద్రి ఆలయాన్ని దూరం నుంచి చూసేందుకు సిట్‌ ఔట్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. బెడ్రూమ్‌లో సెంట్రల్‌ ఏసీ, పక్కనే బాత్‌రూమ్‌లో కోయిలర్‌ గ్లాస్‌తో సెన్సర్‌ సిస్టమ్ ఏర్పాటు చేశారు. లక్ష్మినరసింహస్వామి దర్శించుకొని తిరిగి విల్లాకు వచ్చేందుకు ప్రత్యేకంగా రోడ్లు నిర్మించారు. ఒక విల్లాలో ఏకకాలంలో ఐదు కుటుంబాలు విడిది చేయవచ్చు. సమావేశం ఏర్పాటు చేసేందుకు విశాలమైన కాన్ఫరెన్స్‌ హాళ్లను నిర్మించారు. https://booking.ytda.in/ వెబ్‌ సైట్‌లో రూమ్‌లను బుక్‌ చేసుకొనే వీలుంది.

Next Story