Fraud Alert: విదేశాల్లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులే వారి టార్గెట్.. జాగ్రత్త!!
సైబర్‌క్రైమ్ ఘటనలు పెరిగిపోతున్న ఈ కాలంలో.. విదేశాల్లోని కొందరు పిల్లలు కిడ్నాప్ కు గురవుతూ ఉన్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 May 2024 3:00 PM GMTFraud Alert: విదేశాల్లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులే వారి టార్గెట్.. జాగ్రత్త!!
తెలుగు రాష్ట్రాల నుండి ఎంతో మంది విద్యార్థులు చదువుకోడానికి విదేశాలకు వెళుతూ ఉన్నారు. బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆశించి ఎంతో మంది వెళ్లిన చాలా మంది విద్యార్థులకు అనుకోని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆన్ లైన్ లో కూడా పలు మోసాలకు గురవుతూ ఉంటారు.
సైబర్‌క్రైమ్ ఘటనలు పెరిగిపోతున్న ఈ కాలంలో.. విదేశాల్లోని కొందరు పిల్లలు కిడ్నాప్ కు గురవుతూ ఉన్నారు. మీ పిల్లాడిని కిడ్నాప్ చేశామని దుండగులు చెబుతూ ఉండగా.. ఇక్కడి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమైపోతోందా అనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీ పిల్లలను అపహరించాం.. మేము చెప్పిన డబ్బులు ఇస్తేనే వదిలిపెడతామనే బెదిరింపులతో తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని, కొత్త మోసాలకు పాల్పడుతూ ఉన్నారు.
విదేశాల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులకు పోలీసు అధికారుల ఫోటోలతో వాట్సాప్ లలో మెసేజీలు వస్తున్నాయి. తెలియని అంతర్జాతీయ నంబర్‌ల నుండి టార్గెట్ చేస్తున్నారు. ఈ కాలర్లు మీ పిల్లలను కిడ్నాప్ చేశామని, వారు సురక్షితంగా తిరిగి రావడానికి డబ్బులు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. తాము పోలీసు ఆఫీసర్లు అంటూ చెప్పి కూడా ఇక్కడి తల్లిదండ్రులను మోసం చేస్తూ ఉన్నారు.
విద్యార్థుల వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించి మోసాలు:
VoIP కాల్‌స్ ద్వారా ఈ సంఘటనలు ఎక్కువవుతూ ఉన్నాయి. తల్లిదండ్రులు, ముఖ్యంగా తమ పిల్లలను చదువుల కోసం విదేశాలకు పంపే వారు ఈ మోసపూరిత కాల్‌లకు నిత్యం బలి అవుతున్నారు. తాజాగా జరిగిన ఓ విషాద ఘటన ఈ ఆందోళనకరమైన ధోరణికి అద్దం పడుతోంది.
అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌లో మహ్మద్ అబ్దుల్ అరాఫత్ అనే భారతీయ విద్యార్థి ఈ ఏడాది మార్చి 7న కిడ్నాప్‌కు గురయ్యాడు. పది రోజుల తర్వాత, అతనిని విడుదల చేయడానికి $1200 డిమాండ్ చేస్తూ అతని తల్లిదండ్రులకు గుర్తు తెలియని వ్యక్తి నుండి కాల్ వచ్చింది. అయితే ఆ తరువాత గుర్తు తెలియని దుండగుల చేతిలో అతడు చనిపోయాడు.
ఈ ఘటనను తమకు అనుకూలంగా మలుచుకున్నారు దుండగులు. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు సంబంధించి ఈ ఏడాది ప్రారంభంలో ఇలాంటి రెండు సంఘటనలు నమోదయ్యాయి. సైబర్ మోసగాళ్లు USAలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల డేటాను పొందారు, వారు మీ పిల్లలను కిడ్నాప్ చేశామంటూ.. ఆ పిల్లల తల్లిదండ్రులను సంప్రదించారు. భారీగా డబ్బును డిమాండ్ చేశారు. ఈ సమయంలో పిల్లలు సురక్షితంగా ఉన్నారో లేదో తెలియని తల్లిదండ్రులు ఎంతగానో టెన్షన్ పడ్డారు.
భారత్‌లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులే టార్గెట్:
ఇలాంటి ఫేక్ కాల్స్ విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను టార్గెట్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎంతో మంది భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు ఇలాంటి కాల్స్ ను ఎదుర్కొన్నారు. పాకిస్తాన్/UK మొబైల్ నంబర్‌ల నుండి బెదిరింపు కాల్‌స్ వచ్చాయని కూడా కొన్ని ఫిర్యాదులు అందాయి. కొన్ని ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కీలక సూచన:
- మీరు పైన వివరించిన విధంగా బెదిరింపు కాల్‌స్ ని అందుకున్నట్లయితే, 100 లేదా 1930కి కాల్ చేయండి. ఫిర్యాదును ఫైల్ చేయడానికి వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌ని సందర్శించండి.
- మీకు అలాంటి కాల్‌లు వస్తే, మీ పిల్లలకు ఉన్న భద్రత గురించి ఆరా తీసేందుకు సంబంధిత సంస్థలను సంప్రదించండి.
- వీలైతే, దర్యాప్తు ప్రక్రియలో సహాయం చేయడానికి అలాంటి కాల్‌లను వెంటనే రికార్డ్ చేయండి.