ఆ ఆలయం వైపు సాయంత్రం వెళ్లొద్దంటారు.. ఎందుకో తెలుసా.?
Mysterious Facts About Nidhivan Temple. దేవాలయాలకు పెట్టింది పేరు మన భారతదేశం. ఇక్కడ ఒక్కో ప్రాంతంలోని ఆలయానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది.
By అంజి Published on 2 Aug 2022 6:57 AM GMTదేవాలయాలకు పెట్టింది పేరు మన భారతదేశం. ఇక్కడ ఒక్కో ప్రాంతంలోని ఆలయానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. వాటిలో బృందావనంలోని నిధివన్ ఆలయానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రతి ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమిని ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. నిధివన్‌లోనే కృష్ణుడు నిత్యం వందలాది గోపికలతో రాసలీలలు చేసేవాడట. ఈ ప్రాంతం ఇప్పటికీ ఉనికిలో ఉంది. నిధివన్ ఆలయానికి ఉదయం వేళల్లో మాత్రమే భక్తులను అనుమతిస్తారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఆ పరిసరాల్లోకి అడుగు పెట్టకూడదు. ఎందుకంటే రాత్రి సమయంలో ఇప్పటికీ శ్రీకృష్ణుడు తన గోపికలతో ఆటలాడుతాడట. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా.. స్థానికులు మాత్రం దీన్ని బలంగా నమ్ముతారు.
నిధివన్ గురించి చెప్పమని అక్కడి స్థానికులను అడిగితే వారు ముందుగా చెప్పే విషయం ఇదే. సూర్యోదయం తర్వాత ఎంతసేపైనా అక్కడ గడపండి. కానీ సూర్యాస్తమయం తర్వాత అటు వైపు వెళ్లొద్దని హెచ్చరిస్తారు. ప్రతి రాత్రి కృష్ణుడు అక్కడికి వచ్చి తన ప్రియురాలు రాధా, ఇతర గోపికలతో కలిసి నృత్యం చేస్తాడని ప్రజలు విశ్వసిస్తున్నారు. అక్కడి ప్రజలు దీన్ని ఇప్పటి వరకు ప్రత్యక్షంగా చూడలేదు. దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అయితే నిధివన్‌లో రహస్యాన్ని ఛేదించేందుకు గతంలో చాలా మంది ప్రయత్నించారు. కొందరు నిధివన్‌లో చెట్ల వెనుక దాక్కొని నిజాన్ని తెలుసుకుందామనుకున్నారు. అలా చేసిన వారిలో కొందరు మతిస్థిమితం కోల్పోవడం, కొందరు చూపు, మాట కోల్పోవడం వంటివి జరిగాయట. అందుకే నిధివన్ సమీపంలో నివసించే ప్రజలు రాత్రి అయితే అటువైపు ఉండే కిటికీలు, తలుపులు తెరవరు.
నిధివన్‌లో అడుగు పెడితే మీకు అక్కడ అనేక చెట్లు కనిపిస్తాయి. ఆ చెట్లే రాత్రివేళల్లో గోపికలుగా మారతాయని, తెల్లవారుజామున మళ్లీ చెట్లుగా కనిపిస్తాయని స్థానికులు చెబుతారు. ఆ చెట్లు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. చెట్ల వేర్లు పైకి ఉన్నట్లుగా వంకరటింకరగా ఉంటాయి. ఇక నిధివన్ లోపలే 'రంగ్ మహల్' ఆలయం ఉంది. దీన్నే రాధా రాణి హ్రీంగర్-ఘర్ అని కూడా అంటారు. జానపద కథల ప్రకారం.. కృష్ణుడు ప్రతి రాత్రి ఇక్కడకు వస్తాడు. తన చేతులతో స్వయంగా రాధను ఆభరణాలతో అలంకరిస్తాడు. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్తే.. రంగ్ మహాల్ లోపల ఒక మంచం, దానికి సమీపంలో అనేక ఆభరణాలు, అలంకరణ సామాగ్రిని చూడవచ్చు.