ఎలెక్ట్రిక్ వాహనాలు తరచుగా ఎందుకు అగ్ని ప్రమాదాలకు గురవుతూ ఉన్నాయి..?

Explained Why do electric bikes catch fire.సికింద్రాబాద్ లోని ఎలెక్ట్రిక్ వాహనాల షోరూంలో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Sep 2022 6:29 AM GMT
ఎలెక్ట్రిక్ వాహనాలు తరచుగా ఎందుకు అగ్ని ప్రమాదాలకు గురవుతూ ఉన్నాయి..?

సికింద్రాబాద్ లోని ఎలెక్ట్రిక్ వాహనాల షోరూంలో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే..! ఈ అగ్ని ప్రమాదంలో రూబీ మోటార్స్, రూబీ లాడ్జ్‌లో ఎనిమిది మంది మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. మరోసారి ఎలెక్ట్రిక్ బైక్ లకు సంబంధించి పలు ప్రశ్నలను లేవనెత్తింది. మంటలు చెలరేగే సమయంలో సెల్లార్‌లో 40 బైక్‌లు చార్జింగ్‌ అవుతున్నాయని చెబుతున్నారు. బైక్ పాయింట్ నుంచి లేదా జనరేటర్ దగ్గర నుండి మంటలు చెలరేగాయా అనేది అగ్నిమాపక శాఖ ఇంకా వెల్లడించలేదు.


ఎలెక్ట్రిక్ బైక్‌లు విపరీతంగా మండడానికి కారణం ఏమిటి..?

ఎలెక్ట్రిక్ బైక్ లలో ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడానికి బైక్ బాడీ కూడా ఒక కారణం. ఇది ప్లాస్టిక్ ఫైబర్ తో తయారు చేయబడింది. ప్లాస్టిక్, ఫైబర్లు చాలా ఎక్కువగా మండే గుణం కలవి. ప్లాస్టిక్ ఫైబర్ తో బైక్ బాడీ ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటుందనే కారణంతో ఇటీవలి కాలంలో వచ్చే కొత్త బైక్ లను చాలా వరకూ ఫైబర్ తోనే తయారు చేస్తూ ఉన్నారు. బిల్డ్ క్వాలిటీని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

బైక్‌ల ప్రామాణికతను ఎవరు తనిఖీ చేస్తుంటారు..?

బైక్‌ల బాడీకి సంబంధించి కేంద్రంలో ఇంకా నిబంధనలు రూపొందిస్తున్నారు. స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బైక్‌ల మెటీరియల్, బాడీకి సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ నియమాలు, స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తుంటారు. 2022 వేసవిలో కూడా ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. ఒకానొక దశలో ఎలెక్ట్రిక్ బైక్ లు కొనాలంటేనే భయం పట్టుకుంది. కొన్న వాళ్లు ఛార్జింగ్ పెట్టాలంటేనే జంకేలా చేశాయి. కొన్ని నెలల కిందట పూణేలోనూ, భారతదేశంలోని ఇతర ప్రాంతాలలోని కర్మాగారాల్లో జరిగిన ప్రమాదాలు తీవ్ర సంచలనం సృష్టించాయి.. ఇప్పటికీ మార్గదర్శకాలు రూపొందించబడలేదు. బ్యాటరీలను పరీక్షించడానికి, ప్రమాణీకరణ, ధృవీకరణ కోసం పూణేలో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎలెక్ట్రిక్ వాహనాల తయారీదారులందరూ అక్కడ బ్యాటరీలను పరీక్షించవలసి ఉంటుంది.

బ్యాటరీ భాగాలకు ఇప్పటికీ ప్రామాణికత ఉండడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఎక్కడో తయారు చేసి.. ఇక్కడకు తీసుకుని వచ్చిన బ్యాటరీలు.. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వాతావరణంలో ఉన్న హెచ్చుతగ్గుల కారణంగా కూడా బ్యాటరీలు పేలడానికి కారణమవుతూ ఉన్నాయని వాదించే వారు కూడా లేకపోలేదు.

బైక్‌లకు విపరీతమైన డిమాండ్‌

దేశంలో పెట్రోల్/డీజిల్ ధరలు పెరిగిన తర్వాత ఎలక్ట్రిక్ బైక్‌లకు డిమాండ్ బాగా పెరిగింది. ఇప్పుడు చాలా నగరాల్లోనే కాదు.. చిన్న చిన్న టౌన్ లలో కూడా ఎలెక్ట్రిక్ బైక్ షోరూమ్‌లు ఉన్నాయి. పెరుగుతున్న విక్రయాల కారణంగా.. బైక్ కు సంబంధించిన భద్రత గురించి పట్టించుకోవడం లేదా..? అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. ఇది కేవలం ప్లగ్-అండ్-ప్లే మెకానిజం కాదని.. అనేక భద్రతా అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

భద్రతకు సంబంధించి బాధ్యత ఎవరిది?

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వివిధ పునరుత్పాదక ఇంధన రూపాలపై అవగాహన కల్పించాలని తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ పేర్కొంది. వాహనాల షోరూమ్‌లు మరియు వాటి నిర్వహణను స్థానిక మున్సిపల్ అధికారులు చూడాల్సి ఉండగా, షోరూమ్ స్థాయిలో ఛార్జింగ్ పాయింట్‌లను బైక్‌లను సరఫరా చేసే విషయాలను తయారీదారులు చూసుకోవాల్సి ఉంటుంది. నాణ్యత, భద్రతకు రవాణా శాఖ బాధ్యత వహిస్తుంది.

మూడు వేర్వేరు రంగాలు EVలను పర్యవేక్షిస్తున్నాయి. అందుకే ఈ గందరగోళం ఉందనే విమర్శలు కూడా వస్తున్నాయి. భద్రతా అంశానికి ఎవరు బాధ్యత వహిస్తారంటే మాత్రం.. EVని నిర్వహించే వ్యక్తులు లేదా వాటిని కొన్న యజమానులపై ఉంది. యజమానులు ఎప్పటికప్పుడు ఛార్జింగ్ పాయింట్ దగ్గర నుండి.. బైక్ బ్యాటరీకి సంబంధించిన పలు అంశాలను చూసుకోవాల్సి ఉంటుంది.


సికింద్రాబాద్ అగ్నిప్రమాదం:

సికింద్రాబాద్ ప‌రిధిలోని రూబీ ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో సోమ‌వారం రాత్రి జ‌రిగిన అగ్ని ప్ర‌మాదం కారణంగా 8 మంది చ‌నిపోయారు. రూబీ హోట‌ల్ సెల్లార్‌లో ఎల‌క్ట్రిక్ బైకుల షోరూంలోనే అగ్ని ప్ర‌మాదం జ‌రిగి ఉంటుంద‌ని, అక్క‌డి నుంచి వెలువ‌డ్డ పొగ‌ల‌తో ఊపిరాడ‌క లాడ్జిలోని వారు చ‌నిపోయార‌న్న వాద‌న‌లు వినిపించాయి. తాజాగా విడుద‌లైన రూబీ హోట‌ల్ సీసీటీవీ ఫుటేజీ చెబుతోంది. ఈ వీడియోలో హోట‌ల్ సెల్లార్‌లో ఉన్న ఎల‌క్ట్రిక్ బైకుల వ‌ద్ద తొలుత పేలుడు సంభ‌వించ‌గా ఆ త‌ర్వాత ప‌లు బైకులు వ‌రుస‌గా పేలిన‌ట్లు సీసీటీవీ ఫుటేజీలో క‌నిపిస్తోంది. అక్క‌డ జ‌రిగిన పేలుడుతోనే ద‌ట్ట‌మైన పొగ‌లు లాడ్జిని చుట్టుముట్టిన‌ట్లు అందులో క‌నిపిస్తోంది. క్షణాల్లో పొగ కమ్మేసింది.

ఈ భవనంలో 5 అంతస్తులు ఉన్నాయి. హోటల్‌లో 28 గదులు ఉన్నాయి. భవనం (పాస్‌పోర్ట్ కార్యాలయం సికింద్రాబాద్‌కు సమీపంలో ఉంది)లో మంటలు చెలరేగినప్పుడు హోటల్‌లో 25 మంది వ్యక్తులు ఉన్నారు.

Next Story