కరోనా నుంచి రక్షణ కోసం డబుల్ మాస్కులు మంచిదంటున్న నిపుణులు.. ఎలాంటి మాస్కులు వాడాలి?
Double-masking amid COVID-19. వైరస్ వ్యాప్తిని నిరోధించాలంటే కేవలం ఒక మాస్కు సరిపోదని.. రెండు మాస్కులు ధరించాలని పలువురు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
By Medi Samrat Published on 11 May 2021 7:38 AM ISTప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా భారత్‌లో వైరస్ విజృంభిస్తోంది. లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు కొనసాగుతున్నాయి. మరోవైపు కరోనా గాలి ద్వారా వ్యాపిస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ ను ఎదుర్కొనడంలో ఉన్న మార్గాల్లో మాస్కు ధరించడం అతి ముఖ్యమైనది. అయితే ఇప్పుడున్న వైరస్ వ్యాప్తిని నిరోధించాలంటే కేవలం ఒక మాస్కు సరిపోదని.. రెండు మాస్కులు ధరించాలని పలువురు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రెండు మాస్కులు పెట్టుకోవడంవల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) కూడా ఇదివరకే చెప్పింది. ప్రస్తుతం అధికారులు, స్వచ్ఛంద సంస్థలు డబుల్ మాస్కింగ్ పేరుతో అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు మాస్కులను ఎలా వాడాలి? ఎలాంటి మాస్కులు ధరించాలి? అన్న విషకాలను తెలుసుకుందాం.
కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుంది?
దగ్గినపుడు లేదా తుమ్మినప్పుడు నోరు, ముక్కు నుంచి వెలువడే తుంపర్లు గాలి ప్రసరించి ఎదుటివారిపై పడుతుంటాయి. ఈ తుంపర్ల ద్వారా ఇతరులకు వైరస్ వ్యాపిస్తుంది. మాట్లాడినప్పుడు లేదా దగ్గినప్పుడు వైరస్ 6 అడుగుల దూరం వరకు వ్యాప్తి చెందుతుంది. అదే తుమ్మినప్పుడు 18 అడుగుల దూరం వరకు వైరస్ చేరుకోగలుగుతుంది.
మూసి ఉంచిన గదుల్లోనే ఎక్కువ
బహిరంగ ప్రదేశాల కంటే.. గాలి వెలుతురు సరిగ్గాలేని, తలుపులు మూసి ఉంచిన గదుల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మూసి ఉంచిన గదిలో కరోనా వైరస్ గాలిలో మూడు గంటల పాటు ఉంటుంది. ఒక వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు తుంపర్ల ద్వారా బయటకొచ్చిన వైరస్‌లో దాదాపు సగం తొలి గంటలోనే కిందపడిపోతుంది. మిగిలిన సగం వైరస్ నేలను చేరడానికి ఇంకో రెండు గంటల సమయం పడుతుంది. కాబట్టి ఒకే గదిలో ఎక్కువ మంది గుమిగూడితే ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి వేగంగా జరిగే అవకాశం ఉంటుంది.
మాస్క్ ధరించడం వలన ప్రయోజనం ఏంటి?
మాస్క్ ధరిస్తే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు. వైరస్ లోడ్‌ను మాస్కులు అడ్డుకుంటాయి కాబట్టి వైరస్ శరీరంలోకి ప్రవేశించినా తక్కువ లోడ్ మాత్రమే వెళ్తుంది. శరీరంపై వైరస్ తీవ్రత కూడా చాలా తక్కువగా ఉంటుంది.
రెండు మాస్కులు ఎందుకు వాడాలి
కరోనా వైరస్ రెండో దశలో తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఖచ్చితంగా మాస్కులు వాడాలి. మాస్కులు ధరించకపోతే ప్రభుత్వాలు ఫైన్లు కూడా వేస్తున్నాయి. ముఖ్యంగా ప్రజలు ఒకదగ్గర గుంపులుగా ఉన్నచోట రెండు మాస్కులు వాడితే ఇంకా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించని ఇద్దరు వ్యక్తులు వ్యక్తిగత దూరం పాటించనప్పుడు.. ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సోకే అవకాశం 90 శాతం ఉంటుంది. ఒక్క మాస్క్ వాడితే వైరస్ వ్యాప్తి రేటు 60 శాతం వరకు తగ్గుతుంది. అదే రెండు మాస్కులు వాడితే వైరస్ వ్యాప్తిని 80 శాతానికి పైగా అడ్డుకోవచ్చు. ముఖ్యంగా కరోనా లక్షణాలు ఉన్నవారు రెండు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. అదే ఎన్-95 మాస్కులు ధరిస్తే వైరస్ నుంచి 95 శాతం రక్షణ లభిస్తుంది. కాబట్టి ఎన్ 95 మాస్క్ అయితే ఒక్కటి వాడినా సరిపోతుంది.
ఎన్-95 మాస్కుల్లో ఎలాంటివి వాడాలి
రెస్పిరేటరీ వాల్వ్ లేని ఎన్ 95 మాస్కులను మాత్రమే వాడాలి. రెస్పిరేటరీ వాల్వ్‌లు వాతావరణంలో ఉండే గాలిని శుద్ధి చేసి మనకు అందిస్తాయి. అదే మనం వదిలిన గాలిని మాత్రం నేరుగా బయటకు పంపిచేస్తుంది. ఒకవేళ కరోనా సోకిన వారు రెస్పిరేటరీ వాల్వ్ ఉన్న ఎన్-95 మాస్కులు ధరిస్తే వారు వదిలిన గాలి నేరుగా బయటకు వచ్చేస్తుంది. దీంతో ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. రెస్పిరేటరీ వాల్వ్ లేని ఎన్ 95 మాస్కులను మాత్రమే వాడాలి.
ఏ మాస్కుతో రక్షణ ఎక్కువ
-ఎన్-95 తో 95 శాతం
-సర్జికల్ మాస్క్ 56 శాతం
-బట్ట మాస్క్ 49 శాతం
-కర్చీఫ్ 33 శాతం
రెండు ఒకే రకం మాస్కులు వాడొచ్చా?
ఎన్-95 మాస్కుల ధర ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని ఉపయోగించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు రెండు మాస్కుల విధానాన్ని పాటించడం మంచిది. అలా అని రెండు సర్జికల్ మాస్కులు లేదా డబుల్ లేయర్ మాస్కులనే వాడకూడదు.
ఒకే రకం మాస్కులను ఎందుకు వాడకూడదు
ఒకేరకమైన రెండు మాస్కులు ధరించడం వల్ల పొరలు పెరుగుతాయే తప్ప ఎలాంటి అదనపు ప్రయోజనం ఉండదు. మాస్కు పొరలు పెరిగినప్పటికీ వాటి మధ్య ఉండే ఖాళీలు అలాగే ఉంటాయి. ఆ ఖాళీల నుంచి ముక్కు, నోటి ద్వారా వైరస్ శరీరం లోపలికి ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంది. అదే రెండు విభిన్న రకాల మాస్కులు వాడితే మాస్కు పొరల్లో ఉండే ఖాళీలను పూడ్చినట్టుగా ఉండటమే కాకుండా.. రెండింటి ఆకృతి వేరేలా ఉంటుంది కాబట్టి ముఖానికి బిగుతుగా పట్టేసినట్టు ఉండి వైరస్ వ్యాప్తిని నియంత్రించగలుగుతాయి. కాబట్టి రెండు వేర్వేరు మాస్కులు వాడడం మంచిది.
రెండు మాస్కుల్లో ఏది పై నుంచి పెట్టుకోవాలి
ముందుగా సర్జికల్ మాస్క్ ధరించి, దాని పైనుంచి ఇంకో మాస్క్ పెట్టుకోవాలి. దీనివల్ల 85.4 శాతం వరకూ రక్షణ లభిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గాలి పీల్చుకోవడంలోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదు.
రెండు మాస్కులు లేకపోతే ఎలా?
ఒకవేళ రెండు మాస్కులు లేకపోతే ఒక సర్జికల్ మాస్క్ ధరించవచ్చు. అయితే మాస్కులకు రెండు పక్కల ఉన్న రబ్బర్ మొదటి భాగాన్ని ముడివేసి ఎలాంటి గ్యాప్ లేకుండా చేయాలి. రెండు వైపులా ముడివేయడం వల్ల ముక్కు, నోటిని కప్పేసినట్టుగా మాస్క్ ఉంటుంది. దీనివల్ల 77 శాతం వరకు రక్షణ ఉంటుంది. ముడి వేయకుండా వాడితే 56 శాతం మాత్రమే రక్షణ లభిస్తుంది.
మాస్క్ పెట్టుకుంటే కరోనా సోకదా
అలా అని పూర్తిగా రక్షణ ఉండదు. మాస్క్ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా తిరగకూడదు. మాస్క్ ఉన్నప్పటికీ ఇతరులతో ఆరడుగుల దూరం పాటించడం తప్పనిసరి. ఇద్దరికీ మాస్కులు ఉన్నాయి కదా అని ముఖంలో ముఖం పెట్టి మాట్లాడటం కూడా మంచిది కాదు. అంత దగ్గర నుంచి మాట్లాడితే 5 మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న తుంపర్లు నేరుగా ముక్కు, నోరు ద్వారా శరీరంలోకి వ్యాపించే అవకాశం ఉంటుంది.
మాస్కు పట్ల ఈ జాగ్రత్తలు అవసరం
* మాస్కు పెట్టుకునే ముందు, తర్వాత చేతులు శానిటైజ్ చేసుకోవాలి.
* మనం పెట్టుకునే మాస్క్ ముక్కు, నోరు, గడ్డం పూర్తిగా కవర్ చేసేలా ఉండాలి.
* క్లాత్ మాస్కులను వాడిన తర్వాత వేడి నీటిలో నానబెట్టి శుభ్రంగా ఉతుక్కోవాలి. సర్జికల్ మాస్కులను అయితే ఒకసారి వాడగానే పాడేయాలి. అది కూడా మూత ఉన్న చెత్తకుండీలో జాగ్రత్తగా పారేయాలి.
* క్లాత్ మాస్క్‌ను ఉతికాం కదా అని ఒకరి మాస్క్‌ను మరొకరు వాడకూడదు.
* తడిచిన, చెమట పట్టిన, చిరిగిన మాస్కులను పెట్టుకోకూడదు.
* మాస్కును తొలగించేటప్పుడు చెవుల దగ్గర ఉన్న దారాన్ని పట్టుకుని మాత్రమే తీసివేయాలి.
* ఇతరులతో మాట్లాడేటప్పుడు లేదా.. ఏవైనా తినేటప్పుడు మాస్కును గడ్డం కిందకు దించడం, తలపైకి పెట్టడం చేయరాదు.