ప్రస్తుత కాలంలో మహిళల ఫాష్యన్‌లో భాగమైన హై హీల్స్.. మొదటగా మగవారి కోసమే ప్రత్యేకంగా తయారు చేయబడ్డాయి. అవును మీకు నమ్మబుద్ధికాకున్నా.. ఇదే పచ్చి నిజం. ఈ హైహీల్స్ వెనుక చాలా పెద్ద చరిత్రే ఉంది. మహిళలు హీల్స్ ధరించడానికి చాలా కాలం ముందు పురుషులు ధరించేవారు. కాలం మారుతున్న కొద్ది హైహీల్స్ మహిళల అందానికి అదనపు ఆకర్షణగా మారిపోయాయి.
10వ శతాబ్దంలో పెర్షియన్ సైనికుల కోసం మొదట ఈ హీల్స్‌ను తయారు చేశారు. హీల్స్ వేసుకున్న సైనికులు ఎత్తుగా కనిపించడంతో పాటు శత్రువులపై బాణాలు వేసేందుకు వారికి సరైన పట్టు దొరికేది. ఈ కారణంతోనే హైహీల్స్‌తో ఓ స్పెషల్ కేటగిరీని ఏర్పాటు చేశారు. అప్పట్లో వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉండేది. వాళ్లను అందరూ గౌరవంగా చూసేవాళ్లు. ప్యారిస్‌లో రైడర్స్ కూడా కొంత కాలం హైహీల్స్ ధరించారు. హీల్స్‌ను వారు స్టేటస్ సింబల్‌గా వాడుకునే వారు.
మెల్లమెల్లగా ఈ హీల్స్ ట్రెండ్ కాస్తా ఐరోపా దేశాలకు పాకింది. అక్కడి సైనికులు కూడా ఎత్తుగా కనిపించేందుకు హైహీల్స్‌ను వాడారు. దీన్ని పవర్‌ఫుల్ మిలటరీ స్ట్రాటజీగా కూడా వాడుకున్నారు. 17 శతాబ్దం నాటికి ఐరోపాలో ఉన్నత మహిళల ఫ్యాషన్‌గా మారింది. వెనీస్‌లో చాలా మంది మహిళలు ఎత్తైనా హీల్స్ వేసుకునే వాళ్లు. వీరు కూడా దీన్ని స్టేటస్ సింబల్‌గా చూపించుకునేవారు.
1673లో పద్నాలుగో లూయీస్ రెడ్ హీల్స్, రెడ్ సోల్‌తో కూడిన బూట్లను ప్రవేశపెట్టారు. అప్పట్లో వాడే హీల్స్‌ను బట్టి సమాజంలోని ప్రజలను వర్గీకరణ చేసేవారు. 1740 తర్వాత క్రమంగా పురుషులు హైహీల్స్ వేయడం మానేశారు. అలా ఒకప్పుడు స్టేటస్ సింబల్‌గా ఉన్న హైహీల్స్ నేడు మహిళల ఫ్యాషన్‌లో భాగమైంది.