వ్యాక్సిన్‌ కోసం ఎలా రిజిస్టర్‌ చేసుకోవాలి?

COVID-19: How to register for vaccine. క‌రోనా వ్యాక్సిన్‌కై రిజిస్టర్‌ చేసుకొనేందుకు కొ-విన్‌ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మొబైల్‌ యాప్

By Medi Samrat  Published on  5 Jan 2021 4:18 AM GMT
corona vaccine registration

క‌రోనా వ్యాక్సిన్‌కై రిజిస్టర్‌ చేసుకొనేందుకు కొ-విన్‌ అనే వెబ్‌సైట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. త్వరలోనే మొబైల్‌ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్న‌ది. దీంతో వైబ్‌సైట్‌, యాప్ ద్వారా నేరుగా ఎవ‌రైనా వ్యాక్సిన్‌కై రిజిస్టర్‌ చేసుకోవచ్చు. ఇక వైబ్‌సైట్‌లో కొ-విన్‌ పోర్టల్‌ ఓపెన్‌ చేయగానే రిజిస్ట్రేషన్‌ అనే ఆప్షన్‌ వస్తుంది. అందులో ఆధార్‌ నంబర్ ఎంట‌ర్ చేయాలి. వెంటనే మీ పేరు, శాశ్వత చిరునామా తదితర వివరాలన్నీ అందులో కనిపిస్తాయి. ఆ వెంటనే ఆధార్‌ నంబర్‌తో నమోదై ఉన్న మొబైల్‌ నంబర్‌కు ఓ ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసిన‌ తర్వాత ఫొటో గుర్తింపు కార్డును అప్‌లోడ్‌ చేయగానే రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది.

ఇక ఆధార్‌ కార్డుపై ఉన్న శాశ్వ‌త‌ చిరునామాలు లేనివారు.. ప్రస్తుతమున్న‌ చిరునామా, పుట్టిన తేదీలను స్వయంగా కూడా ఎంటర్‌ చేయవచ్చు. అయితే.. పూర్తి వివరాలు నమోదు చేసిన తర్వాత 'డెమో అథెంటికేషన్‌' అనే ఆప్షన్‌ను ఎంపికచేసుకోవాలి. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే గ్రీన్‌ టిక్‌తో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయినట్టు చూపిస్తుంది.

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తికాగానే ఎప్పుడు? ఎక్కడ? మీకు టీకా వేస్తారు.. అనే వివరాలతో కూడిన సందేశం మీ మొబైల్‌ నంబర్‌కు వస్తుంది. కొ-విన్‌లో రిజిస్టర్‌ చేసుకున్నవారికి మాత్రమే టీకాలు వేస్తారు. నేరుగా టీకా కేంద్రానికి వెళ్లినా వేయరు.

కొ-విన్‌లో పేరు ఎప్పుడు నమోదు చేసుకోవాలి?

ప్రస్తుతం ఈ సాఫ్ట్‌వేర్‌లో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ వివరాలు మాత్రమే నమోదు చేస్తున్నారు. సామాన్య ప్రజల వివరాల నమోదుపై త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తర్వాత ఎవరికి వారు ఈ పోర్టల్‌ లేదా యాప్‌లో పేరును స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలి. దానిని బట్టి టీకా వేసే సమయాన్ని కేటాయిస్తారు.

టీకా సెషన్‌ను ఎవరు.. ఎలా నిర్ణయిస్తారు?

ఏయే కేంద్రాల్లో టీకాలు ఎప్పుడు వేయాలి? ఎన్ని సెషన్లలో ఎంతమందికి వేయాలన్న అంశాలను జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయిస్తుంది. జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి సాయంతో కలెక్టర్‌ టీకా సెషన్‌ను ఖరారు చేస్తారు. టీకా కేంద్రాలు, టీకాలు వేసే సిబ్బంది, సూపర్‌వైజర్లు, టీకా వేసుకొనేవారు ఎవరు అనే విషయాలపై కలెక్టర్‌దే‌ తుది నిర్ణయం.

టీకా కేంద్రం ఎలా ఉంటుంది?

ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను టీకాలు వేసే సెషన్‌ సైట్‌లుగా ఉపయోగిస్తారు. మారుమూల ప్రాంతాల్లో అయితే పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లను కూడా ఇందుకోసం వాడుకొంటారు. టీకా కేంద్రంలో మూడు గదులు ఉంటాయి. ఒక‌టి వెయిటింగ్ రూము, రెండు వ్యాక్సినేషన్ రూము, మూడు అబ్జర్వేషన్ రూములు ఉంటాయి.



Next Story