దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడంతో పాటు వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా మహమ్మారి గాలి నుంచి కూడా వ్యాపిస్తోందనే ఆధారాల నేపథ్యంలో కేంద్రం కొన్నికీలక ఆదేశాలు/మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా లక్షణాలు కనిపిస్తే.. టెస్టు రిజల్ట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే ట్రీట్ మెంట్ స్టార్ట్ చేయాలని సూచించింది. ఇలా చేయడం వల్ల రోగిని ఆస్పత్రి వరకు తీసుకురాకుండా ఆపొచ్చని, తద్వారా మరణాల్ని తగ్గించొచ్చని కేంద్రం అభిప్రాయపడింది.
ఇక ఆర్టీపీసీఆర్ పరీక్షలపై కూడా కీలక మార్గదర్శకాల్ని విడుదల చేసింది. కొంతమందికి ఈ టెస్టులో నెగెటివ్ వచ్చినప్పటికీ కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. తర్వాత కరోనాగా తేలినప్పటికీ అప్పటికే చాలా ఆలస్యమైపోతోంది. అందుకే ఇకపై ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగెటివ్ వచ్చినా.. కరోనా లక్షణాలుంటే వెంటనే ట్రీట్ మెంట్ స్టార్ట్ చేయాలని కేంద్రం సూచించింది. మరోవైపు ఐసొలేషన్ లో ఉన్న పేషెంట్లపై కూడా స్పందించింది. వాళ్ల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, ఏమాత్రం అనుమానం వచ్చినా హాస్పిటల్ జనరల్ వార్డుకు షిఫ్ట్ చేయాలని సూచించింది.
మరీ ముఖ్యంగా హోం ఐసొలేషన్ లో ఉంటూ మందులు వాడుతున్నప్పటికీ జ్వరం తగ్గని పేషెంట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరింది కేంద్రం. దీంతో పాటు హోం ఐసొలేషన్ లో ఉంటూ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిపడే పేషెంట్లకు వెంటనే స్టెరాయిడ్ ట్రీట్ మెంట్ స్టార్ట్ చేయాలని కూడా సూచించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్ లో జరుగుతున్న ట్రీట్ మెంట్ లో మార్పులు చేయాలని కేంద్రం ఆదేశించింది.