నల్గొండ జిల్లా దామచర్ల మండలం బొత్తలపాలెంలో ఓ వ్యవసాయ క్షేత్రంలో 40 రూ.500 నకిలీ నోట్ల కట్టలు కలకలం రేపాయి. నార్కట్‌పల్లి - అద్దంకి రాష్ట్ర రహదారి వెంట ఉన్న ఓ పొలంలో రూ.20 లక్షలు ఫేక్ కరెన్సీ కట్టలను స్థానిక రైతులు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు సంఘటన స్థలాన్ని సందర్శించారు.
ఆ నోట్లపై చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉంది. ఫేక్ కరెన్సీ నోట్లకట్టలను సీఐ వీరబాబు సీజ్ చేశారు. వీటిని ముద్రించిన వారిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వ్యవసాయ క్షేత్రంలో ఈ నోట్లు ఎలా దొరికాయనే దానిపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.