18 నెలల మహీరా.. ఎంతో మంది ప్రాణాలు కాపాడింది
18 Month Old Mahira dies but donates her organs to save many lives.బ్రెయిన్ డెడ్ అయిన 18 నెలల చిన్నారి అవయవాలను ఆమె
By తోట వంశీ కుమార్ Published on 13 Nov 2022 10:41 AM ISTఅవయవదానం.. మన దేశంలో చాలా మందికి దీని గురించి అవగాహన లేదు. తాము చనిపోయినా అవయవదానంతో ఓ నలుగురికి పునర్జమ్మ కలిగించే గొప్ప భాగ్యం ఇది. అవయవదానం చేయడం వల్ల ఎంతో మంది తల్లులకు కడుపుకోత తీర్చవచ్చు. బాల్కానీ నుంచి కింద పడి బ్రెయిన్ డెడ్ అయిన 18 నెలల చిన్నారి అవయవాలను ఆమె కుటుంబసభ్యులు దానం చేశారు. దీంతో రోగుల జీవితాల్లో వెలుగులు ప్రసరించాయి. ఈ ఘటన డిల్లీలోని ఎయిమ్స్(ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో జరిగింది.
ఎయిమ్స్‌లోని న్యూరోసర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ గుప్తా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హర్యానాకు చెందిన మహీరాకు 18 నెలలు. నవంబర్ 6న ఆడుకుంటూ ఇంటి బాల్కనీ నుంచి కింద పడిపోయింది. మెదడుకు గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆ చిన్నారిని ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తీసుకువచ్చారు. నవంబర్ 11న బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు వైద్యులు.
బిడ్డ ఇక తిరిగిరాదు అనే బాధను దిగమింగుకున్న మహీరా తల్లిదండ్రులు.. తమ చిన్నారి కారణంగా పలువురి జీవితాల్లో వెలుగులు నిండాలని భావించారు. అవయవదానానికి ముందుకు వచ్చారు. ఆ చిన్నారి కాలేయాన్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ఐఎల్‌బిఎస్)లో ఆరు నెలల చిన్నారికి మార్పిడి చేశామని, రెండు కిడ్నీలను ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో 17 ఏళ్ల బాలుడికి విజయవంతంగా మార్పడి చేసినట్లు గుప్తా చెప్పారు. గుండె కవాటాలు, కార్నియాను భద్రపరిచినట్లు వెల్లడించారు.
విషాద సమయంలోనూ స్వచ్చందంగా అవయవదానానికి ముందుకు వచ్చిన మహీరా తల్లిదండ్రులను ఆస్పత్రి సిబ్బందితో పాటు పలువురు ప్రశంసించారు. దీనిపై మహీరా తండ్రి మాట్లాడుతూ.. బాగా ఆలోచించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అవయవదానం తరువాత వారిలో తమ పాప బతికి ఉంటుందనే సంతోషమైనా మిగులుతుందని తెలిపాడు.
భారత్‌లో సగటున ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల మంది అవయవాలు దెబ్బతినడం వల్ల మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మహీరా తల్లిదండ్రుల్లా ఆలోచిస్తే ఎంతో మంది అభాగ్యులను కాపాడుకోవచ్చునని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు అవయవదానంపై అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.