ముఖ్యాంశాలు

  • ‘అయోధ్య తీర్పు’పై రివ్యూ పిటిషన్‌
  • ముస్లిం పర్సనల్ లా బోర్డు అసంతృప్తి

సుప్రీం కోర్టు.. నవంబర్ 9న అయోధ్య కేసులో కీలక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ తీర్పు పట్ల ముస్లిం పర్సనల్ లా బోర్డు అసంతృప్తిని వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు ఇచ్చిన అయోధ్య తీర్పు సమీక్షించాలని కోరుతూ.. అత్యున్నత న్యాయస్థానంలో రివ్యూ పిటీషన్ వేయాలని నిర్ణయించింది.

అయోధ్య వివాద పరిష్కారం ప్రక్రియలో మధ్యవర్తిత్వం నెరిపిన కీలక వ్యక్తుల్లో ఒకరైన జమియత్ ఉలామా ఐ హిందీ అధ్యక్షుడు అర్షద్ మదానీ మాట్లాడుతూ.. ఆలయాన్ని కూల్చి మసీదు కట్టినట్టు సుప్రీం చెప్పలేదు. మసీదును మాకు ఇవ్వలేదు. కాబట్టి రివ్యూ పిటిషన్ వేసే హక్కు మాకుంది అని తెలిపారు. .

ఇదిలావుంటే.. సుప్రీం కోర్టు రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించొచ్చని ముస్లిం పర్సనల్ లా బోర్డులోని కొంత‌ మంది సభ్యులు అభిప్రాయ పడుతున్నారని స‌మాచారం. అయినా స‌రే న్యాయ‌బ‌ద్దంగా ముందుకెళుతున్న‌ట్టు తెలుస్తుంది. రివ్యూ పిటిషన్ దాఖలు చేసే తేదీని ఇంకా నిర్ణయించలేదు.

వారిపై నిషేధం విధించండి

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై యూపీ షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీ నిప్పులు చెరిగారు. అతన్ని ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబూ బకర్-అల్ బాగ్దాదీతో పోల్చారు. ఒవైసీ త‌న రెచ్చ‌గొట్టే ప్రసంగాల ద్వారా ముస్లింలను ఉగ్రవాద చర్యలకు, రక్తపాతానికి నెట్టివేస్తున్నారని రిజ్వి ఆరోపించారు. ఓవైసీని, ముస్లిం పర్సనల్ లా బోర్డుల‌ను నిషేధించాల్సిన‌ సమయం ఆసన్నమైందని తీవ్రస్థాయిలో ద్వ‌జ‌మెత్తారు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.