చెంచుల్లో ఉన్న ఐక్యత హైదరాబాదీల్లో లేదా..?!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Sep 2019 8:40 AM GMT
ప్రపంచ నాగరికతలు విలసిల్లింది నదీ తీరాల వెంటనే. ఈజిప్ట్ దగ్గర నుంచి సింధూ నాగరిత ఇలా ప్రతిదీ నదీ తీరాల్లోనే విలసిల్లాయి. నదులు కనుమరుగైనప్పుడు ఆ నాగరికతలు కూడా భూగర్భంలో కలిసిపోయాయి. కాని..మానవుడు మాత్రం చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవడంలేదు.తన స్వార్ధానికి నదులను కలుషితం చేస్తూ భవిష్యత్తు తరాల ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తున్నాడు.
హైదరాబాద్ మహా నగరం కూడా మూసీ నది వెంటే వెలిసింది. ఇప్పుడు మనం చూస్తున్న మూసీ వేరు..400 ఏళ్ల నాటి మూసీ వేరు. గొల్కొండ ప్రభువులు, నిజాం రాజ్యాలకు మూసీ స్వచ్ఛమైన మంచినీరు అందించేది. 1947 వరకు కూడా మూసీ నది వెంట స్వచ్ఛ గాలి వీసేది. జంట నగర వాసులకు మూసీ ప్రకృతి ఇచ్చిన వరంగా ఉండేది. ఆ తరువాతే..మూసీ మురికి కాలువగామారింది.
తెలంగాణాలో రంగారెడ్డి జిల్లా వికారాబాద్ వద్ద అనంతగిరి కొండల్లో పుట్టి నల్గొండ జిల్లా లోని వాడపల్లి లో కృష్ణా నదిలో కలుస్తుంది మూసీ. మూసీ అనగానే మనమందరం ముక్కు మూసుకుంటాం. అయితే, ఈ దౌర్భాగ్యం మూసీకి మనం కల్పించిందే.
1990వ దశకంలో ఈ మురికి నీటిని శుద్ధి పరచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నంలో భాగంగానే మూసీ నది వెంట అంబర్ పేట ప్రాంతంలో కలుషిత నీటి శుద్ధి ప్లాంట్‌ను ప్రారంభించారు. కాని.. దీనికి కేవలం 20 శాతం నీటినే శుద్ధి చేసే సామర్ధ్యం ఉంది. 2000 దశకంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన నందనవనం అనే ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. నందనవనం ప్రాజెక్టులో భాగంగా మూసీ నదీగర్భంలో మురికివాడలను తొలగించాలని ప్రయత్నించారు.
హైదరాబాద్‌లోని 30కి పైగా నాలాల ద్వారా మూసీలోకి మురుగు చేరుతోంది. ప్రస్తుతం ప్రతిరోజు 1500 మిలియన్ లీటర్ల మురుగు మూసీలో కలుస్తోంది. కూకట్‌పల్లి నాలా నుంచి భారీగా మురుగు నీరు మూసీలోకి చేరుతుంది. అత్తాపూర్, అంబర్‌పేట, నాగోల్, నల్లచెరువు ప్రాంతాల్లో 600 మిలియన్ లీటర్ల మురుగును శుద్ధి చేస్తున్నారు.గ్రేటర్ పరిధిలో మురికి నీటిని శుద్ధి చేసేందుకు జీహెచ్ఎంసీ ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా ఖర్చు చేసింది. అయినా మురుగు తగ్గలేదు.
కృష్ణా, గోదావరీ వంటి జలాల్లో పుణ్యస్నానాలు చేసి, పుష్కరాలు నిర్వహించే మనం, మూసీ నదిని అసలు నదిగానే పరిగణించక పోవడం బాధాకరం. ఇప్పుడు పిల్లలకు ఇది ఒక నది అని చెబితే నమ్మే పరిస్థితి లేదు. మూసీ నదిని ఓ మురుగు కాల్వగానే నేటి తరాలు భావిస్తున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డు న ప్రవాహించే మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరముంది. దీనికి ప్రభుత్వాలు, ప్రజలు , సెలబ్రిటీలు ముందుకు రావాలి.
నల్లమల అడవుల్లో యురేనియంకు సంబంధించి శాంపిల్స్ తీసుకుంటేనే పర్యావరణ వేత్తలు, స్టార్లు, సోషల్ మీడియా చెలరేగిపోయింది. 'సేవ్ నల్లమల' అంటూ ఉద్యమాన్నే ప్రారంభించారు.అంతేకాదు.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన కూడా చేయాల్సి వచ్చింది.'సేవ్ నల్లమల' ఉద్యమం ఆహ్వానించదగ్గదే..కాని మూసీ కోసం మనం ఎందుకు ఈ ఆలోచన చేయడం లేదు..?