నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో ఘర్షణ తలెత్తింది. బుధవారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఇరు పార్టీల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. అటు టీఆర్‌ఎస్‌, ఇటు కాంగ్రెస్‌ నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోగా, బోధన్‌ మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డులో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఇమ్రాన్‌ ముక్కును, వేళ్లను, కాంగ్రెస్‌ అభ్యర్థి ఇలియాజ్‌ కొరికాడు. కాంగ్రెస్‌ అభ్యర్థి రిగ్గింగ్‌కు పాల్పడుతున్నాడంటూ అడ్డుకున్నానని, అక్కడే ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తలు తనపై దాడి చేయబోయరని ఇమ్రాన్‌ ఆరోపించారు.

తీవ్ర రక్తస్రావం కావడంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాంగ్రెస్‌ కార్యకర్తలను ప్రశ్నించడంతో వీరి మధ్య ఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్‌ అభ్యర్థి ఇలియాస్‌, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముక్కును కొరికేసినట్లు తెలుస్తోంది. ఘటనపై ఎన్నికల అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ పరామర్శించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులపై దాడికి పాల్పడిన కాంగ్రెస్‌ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులు, అధికారులను కోరారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.