పేరుకు పుర పోరు.. కాంగ్రెస్ బీజేపీలకు అభ్యర్థులే కరువు

By Newsmeter.Network  Published on  17 Jan 2020 7:30 AM GMT
పేరుకు పుర పోరు.. కాంగ్రెస్ బీజేపీలకు అభ్యర్థులే కరువు

"తెలంగాణ పురపాలక సంఘాల ఎన్నికల్లో టీఆర్ఎస్ ను మట్టి కరిపిస్తాం.. ఘోరంగా ఓడిస్తాం.. అది చేస్తాం.. ఇది చేస్తాం " అన్న విపక్షాలకు అసలు పోరాటం మొదలయ్యే సరికి అభ్యర్థులే దొరకలేదు. పోరాటం సంగతి అటుంచి పోరులో దిగేందుకు సైనికులే లేకుండా పోయారు. మరో మాటలో చెప్పాలంటే విపక్ష కాంగ్రెస్, బిజెపిల మాటలైతే కోటలు దాటాయి కానీ కాళ్లు మాత్రం గడప దాటలేదు.

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో 436 చోట్ల అసలు పోటీ చేసేందుకు సభ్యులే లేరు. మొత్తం 120 మునిసిపాలిటీలు, పది కార్పొరేషన్లలో మొత్తం 3052 వార్డులు, డివిజన్లు ఉండగా కాంగ్రెస్ పార్టీ కేవలం 2616 చోట్ల మాత్రమే పోటీకి అభ్యర్థులను దింపింది. బిజెపి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. బిజెపి కేవలం 2313 సీట్లలో మాత్రమే అభ్యర్థులను నిలబెట్టగలిగింది. పలు మున్సిపాలిటీల్లో ఈ పార్టీలు సగం స్థానాలకు కూడా అభ్యర్థులను నిలబెట్టలేకపోయాయి.

కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిలు ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. రంగారెడ్డి లోని ఆమన్ గల్ మున్సిపాలిటీలో 15 స్థానాలుండగా కాంగ్రెస్ ఏడు స్థానాలలోనే పోటీ చేస్తోంది. అమరచింతలో కేవలం పది స్థానాల్లో, ఆర్మూర్ లో 32 స్థానాలుండగా కేవలం 24 చోట్ల మాత్రమే కాంగ్రెస్ పోటీ చేస్తోంది. ఇక భైంసాలో 26 స్థానాల్లో 16 స్థానాలకు, భూపాలపల్లిలో 30 వార్డులకు 23 చోట్ల మాత్రమే కాంగ్రెస్ పోటీ చేస్తోంది. బొల్లారంలో 22 వార్డులుండగా ఎనిమిదిస్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయడం లేదు. ఒకప్పటి కంచుకోట ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 23 స్థానాల్లో ఎనిమిది చోట్ల, వైరాలో సగం స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పోటీకి అభ్యర్థులను నిలబెట్టగలిగింది

బీజేపీ ఎంపీలు ఉన్న నిజామాబాద్, కరీంనగర్ లలో మాత్రమే బిజెపి అన్ని స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టగలిగింది. సోయం బాపూరావు ప్రాతినిథ్యం వహించే ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క ఆదిలాబాద్ కార్పొరేషన్ లో మాత్రమే బిజెపి పూర్తి స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టింది. మిగతా చోట్ల సగం లోపు వార్డులకే అభ్యర్థులను నిలబెట్టగలిగింది.

నిజానికి చాలా చోట్ల ఇండిపెండెంట్లే తెరాసకు ప్రధాన ప్రత్యర్థులు. వీరిలో గెలిచిన వారంతా తరువాత టీఆర్ఎస్ లోకి వెళ్లిపోతారన్నది అందరికీ తెలిసిందే. కాబట్టి టీఆర్ఎస్ దే మొత్తం మీద పై చేయి అవుతుంది.

టీఆర్ఎస్ 2972 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపింది. మిగతా స్థానాలు మిత్రపక్షం మజ్లిస్ కు వదిలేసింది. ఇక ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో బిజెపి, కాంగ్రెస్ లకు చెందిన వారు ఒక్కరూ లేకపోవడం గమనార్హం. ఏకగ్రీవమైన సీట్లలో మూడు తప్ప మిగతావన్నీ టీఆర్ఎస్ ఖాతాలోకే వెళ్లాయి. మూడు సీట్లు మాత్రం ఎంఐఎం గెలుచుకుంది.

Next Story