ఉత్కంఠంగా చైర్మన్ల ఎన్నిక.. కొలువుదీరుతున్న పాలకవర్గాలు

By అంజి  Published on  27 Jan 2020 9:14 AM GMT
ఉత్కంఠంగా చైర్మన్ల ఎన్నిక.. కొలువుదీరుతున్న పాలకవర్గాలు

మున్సిపాలీటీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో లెక్క తెలిపోయింది. కొత్త పాలక వర్గాలు కొలువుదీరుతున్నాయి. మున్సిపాలిటీల చైర్మన్ల ఎన్నిక కొనసాగుతోంది. కాగా పలు మున్సిపాలిటీల్లో ఎక్స్‌ అఫిషియో సభ్యులు ఓట్లు కీలకంగా మారాయి.

సూర్యాపేట మున్సిపల్‌ చైర్మన్‌గా పెరుమాండ్ల అన్నపూర్ణ ఎన్నికయ్యారు. తొమ్మిదో వార్డు నుంచి అన్నపూర్ణ గెలుపొందారు. 22వ వార్డు నుంచి గెలుపొందిన పుట్టా కిశోర్‌ వైస్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. జనరల్‌ మహిళ స్థానంలో దళిత మహిళకు పట్టం కట్టడంపై సర్వత్రా అభినందనలు వ్యక్తమయ్యాయి. చివరి నిమిషం వరకు మంత్రి జగదీష్‌రెడ్డి గోప్యత పాటించారు. కౌన్సిల్‌ హాల్‌లో మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నపూర్ణ పేరును ప్రకటించారు.

తుక్కుగూడ మున్సిపాలిటీలో బీజేపీ నేతలు ఆందోళనలు చేశారు. కే.కేశవరావు ఎలా ఇక్కడ ఎక్స్‌ అఫిషియో సభ్యుడు అవుతాడని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ కార్యాలయానికి ఐదుగురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, ఒక స్వతంత్ర అభ్యర్థి టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపారు. ఐదుగురు ఎక్స్‌అఫిషియో సభ్యులు వచ్చారు.

కోడంగల్‌ నియోజవర్గంలోని కోస్గి మున్సిపాలిటీని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. చైర్మన్‌ శిరీష రాజేష్‌ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శీరిష రాజేష్‌కు ఎమ్మెల్యే పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంఎల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అభినందనలు తెలిపారు.

కోడంగల్‌ మున్సిపాలిటీ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ సభ్యుడు జగదీశ్వర్‌రెడ్డి ఎన్నికయ్యారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో హంగ్‌ ఏర్పడిన దాదాపు అన్ని మున్సిపాలిటీల్లోనూ టీఆర్‌ఎస్‌ పాగా వేసింది. భూత్పూర్‌ మున్సిపాలిటీ చైర్మన్‌గా బస్వరాజ్‌ గౌడ్‌, వైస్‌ చైర్మన్‌గా బీజేపీ నుంచి గెలిచిన కెంద్యాల శ్రీనివాస్‌ ఎంపికయ్యారు.

నేరేడుచర్లలో సాయంత్రం 4 గంటలకు మున్సిపాలిటీ చైర్మన్‌ ఎన్నిక జరగనుంది. కేవీపీ ఓటును రద్దు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

సిరిసిల్ల మున్సిపల్‌ చైర్ పర్సన్‌గా జిందం కళ, వైస్‌ చైర్మన్‌గా మంచే శ్రీనివాస్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Next Story