ఆర్ధిక రాజధాని ముంబైకి భారీ ముప్పు??
By సత్య ప్రియ Published on 31 Oct 2019 6:45 AM GMTదేశ ఆర్ధిక రాజధాని ముంబై మునిగిపోనుందా? నిత్యం జనాభాతో కళకళలాడే కోల్ కతాకి ముప్పు వాటిల్లనుందా? అంటే... అవునని అంటున్నారు న్యూ యార్క్ కి చెందిన క్లైమేట్ సెంట్రల్ సంస్థ వారు. ప్రపంచంలోని తీర ప్రాంతాలపై పరిశోధనలు చేసి 'నేచర్ కమ్యూనికేషన్స్ ' పేరుతో కథనం ప్రచురించారు.
ఈ పరిశోధనల ప్రకారం, సముద్ర మట్టాలు పెరుగుతుండటంతో 2050 నాటికి దాదాపు 150 మిలియన్ల ప్రజలు నివసిస్తున్న భూమి హై టైడ్ లైన్ పరిధిలోకి (వార్షిక వరదల కారణంగా ముంపుకు గురయ్యే ప్రాంతాలు) వస్తుందన్ని చెప్పారు.
ముంబైలోని చాలా భాగం సముద్ర అలల ధాటికి తుడిచిపెట్టుకు పోయే ప్రమాదం ఉందనీ, దక్షిణ ముంబైలోని చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉన్నట్టు రిపోర్ట్ తేల్చింది.
ఈ ముప్పు కోల్ కతాకి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, చైనా, బాంగ్లాదేశ్, వియత్నాం, ఇండొనేసియా, థాయ్ లాండ్, జపాన్ వంటి దేశాలకు కూడా భారీ ముప్పు పొంచి ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.