తాజ్‌ హోటల్‌ను పేల్చేస్తాం.. పాక్‌ నుంచి బెదిరింపులు

By సుభాష్  Published on  30 Jun 2020 11:53 AM IST
తాజ్‌ హోటల్‌ను పేల్చేస్తాం.. పాక్‌ నుంచి బెదిరింపులు

ముంబైలోని తాజ్‌ హోటల్‌ను పేల్చివేస్తామని పాకిస్థాన్‌ నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో హోటల్‌ లోపల, బయట భద్రతను పెంచారు. గత అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఓ అగంతకుడు ఈ బెదిరింపు కాల్‌ చేసినట్లు, అది పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. పాక్‌లోని కరాచీ స్టాక్‌ ఎక్ఛేంజ్‌పై జరిగిన ఉగ్రదాడిని మీరు చేశారని, ఇప్పుడు తాజ్‌ హోటల్‌పై మళ్లీ దాడి జరుగుతుందని ఫోన్‌లో తెలిపాడు. 2008 నవంబర్‌ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో పాక్‌ ఉగ్రవాదులు ఈ హోటల్‌ను టార్గెట్‌ చేస్తూ వస్తున్నారు. తిరిగి అలాంటి దాడి జరుగుతుందని బెదిరింపులు వచ్చాయి. అప్పుడు జరిగిన దాడిలో 166 మంది మృతి చెందగా, 300లకుపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇక తాజాగా వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వచ్చిన బెదిరింపు కాల్‌ పాకిస్థాన్‌కు చెందినదేనని పోలీసులు గుర్తించారు.

కాగా, నిన్న పాకిస్థాన్‌లోని కరాచీ స్టాక్‌ ఎక్ఛేంజ్‌ భవనంలో నలుగురు ఉగ్రవాదులు చొరబడి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఆరుగురు మృతి చెందారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు భవనంలోకి నక్కి ఉండటంతో భద్రతా సిబ్బంది వారి కోసం గాలింపు చర్యలు చేపట్టి చివరకు నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. భవనంలోకి ఉగ్రవాదులు చొరబడగానే భద్రతా సిబ్బంది ముందస్తుగా సిబ్బందిని ఖాళీ చేయించి భవనాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు.

Next Story