దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తోంది. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర పిలుపుతో అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో జనాలు సైతం రోడ్లపైకి రాకుండా ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఇక మనల్ని కాపాడేందుకు పోలీసులు, వైద్యులు, వైద్య సిబ్బంది ఇలా ప్రాణాలు ఫణంగా పెట్టుకుని పని చేస్తున్నారు. కొందరు లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించకుండా బయటకు వస్తుంటే వారిని నచ్చచెబుతూ, దండాలు పెడుతూ రోడ్లపైకి రావద్దని సూచిస్తున్నారు.

ప్రజల బాగోగుల కోసం కరోనాను నిర్మూలించేందుకు 24 గంటలపాటు పోలీసులు రోడ్లపై ఉంటూ రక్షణగా ఉంటున్నారు. అంతేకాదు పోలీసులు వారి వ్యక్తిగత సంతోషాలకు సైతం దూరమవుతూ నిరంతరం శ్రమిస్తున్నారు. లాక్‌డౌన్‌ ఖచ్చితంగా అమలు జరిగేలా ఎంతో కృషి చేస్తున్నారు. ఇక ఈ విషయంపై ముంబై పోలీసుల సమాధానంగా ఓ వీడియోను రూపొందించారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటికే 78వేలకుపైగా వ్యూస్‌ వచ్చాయి.

విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఇంట్లో కుటుంబంతో గడిపే సమయం చాలా తక్కువ అని, ఒక వేళ అవకాశం ఉంటే 21 రోజులు ఇంట్లోనే ఉండేవారమని చెబుతున్నారు ముంబై పోలీసులు. మీ రక్షణ కోసం పోలీసులు బయట ఉంటే, మరి వారి కోసం మీ బాధ్యతగా ఇంట్లో ఉండలేరా.. అంటూ వీడియోలో ఉంటుంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.