ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోయిస్టులు హతం

By సుభాష్  Published on  18 Oct 2020 11:20 AM GMT
ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోయిస్టులు హతం

ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. మంగపేట మండలంలో ఆదివారం పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతం అయినట్లు పోలీసులు వెల్లడించారు. రామచంద్రునిపేట అడవుల్లో జరిగిన ఈ కాల్పులు జరిగినట్లు తెలిపారు. అయితే మృతులు ఇటీవల టీఆర్‌ఎస్‌ నేత భీమేశ్వర్‌రావును హతమార్చిన వారుగా గుర్తించారు పోలీసులు.

కాగా, ఈనెల 10న అర్ధరాత్రి సమయంలో మావోయిస్టులు ములుగు జిల్లా వెంకటాపురంలో టీఆర్‌ఎస్‌ నేత భీమేశ్వర్‌రావుని అర్ధరాత్రి బయటకు లాకొచ్చి కత్తులతో చంపిన విషయం తెలిసిందే. ఇన్‌ఫార్మర్‌ నెపంతో మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ విషయంలో పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకుని గస్తీ పెంచారు. ప్రతి రోజు మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తూ అనుమానితులను ఆరా తీస్తున్న క్రమంలోనే ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

కాగా, ఇటీవల కాలంలో తెలంగాణ సరిహద్దుల్లోకి మావోయిస్టుల కదలికలు ఎక్కువయ్యాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై వారి కోసం అడవుల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు ఎన్‌కౌంటర్‌లు కూడా జరిగి కొందరు మావోయిస్టులు సైతం హతమయ్యారు. అప్పటి నుంచి పోలీసులు వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మావోల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Next Story