హైదరాబాద్‌లో మరో మూడు రోజులు భారీ వర్షాలు

By సుభాష్  Published on  18 Oct 2020 10:52 AM GMT
హైదరాబాద్‌లో మరో మూడు రోజులు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం కారణంగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. గత వారం రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా వరదలు, బురదతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక రానున్న వర్ష సూచనలపై నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

కాగా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో రాగల 24 గంటల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే కురిసి భారీ వర్షాల కారణంగా భాగ్యనగరమంతా జలమయమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ అంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసిన నీటితో నిండిన ప్రాంతాలే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కరోనాతో సతమతమవుతుంటే.. ప్రస్తుతం వరదలతో సతమవుతున్నారు.

Next Story