చెన్నై వైఫల్యాలకు అదే కారణం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Oct 2020 2:13 PM GMT
చెన్నై వైఫల్యాలకు అదే కారణం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) 13వ సీజన్‌లో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిపోగా.. ఒక మ్యాచ్‌ మాత్రమే గెలిచింది. దాదాపు ప్రతి సీజన్‌లో ప్లే ఆప్‌ చేరే చెన్నై లాంటి టీమ్‌ ఇలాంటి ప్రదర్శన చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. చెన్నై వైఫల్యాలకు కారణంగా ఆ జట్టు కీలక ఆటగాడు సురేష్‌ రైనా దూరం కావడమేనని మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిప్రాయపడ్డారు.

టోర్నీ ఆరంభమైనా చెన్నై ఇంత వరకు కుదరుకోలేదని, అలా జరగం ఇదే తొలిసారని పఠాన్‌ అన్నాడు. తాజాగా సంజయ్‌ బంగర్‌తో కలిసి క్రికెట్‌ కనెక్టెడ్‌ కార్యక్రమంలో పాల్గొన్నాడు. కాగా.. సీజన్‌ ఆరంభం నుంచే చెన్నై సమస్యలతో ఉందని.. అలాగే రైనా వెళ్లిపోయినా అతడి స్థానంలో మరో ఆటగాడిని తీసుకోలేదని గుర్తు చేశాడు. ఈ కారణంగానే ధోని జట్టులో అనేక సమస్యలు వస్తున్నాయన్నాడు. ఒక వేళ రైనా ఉండి ఉంటే.. చెన్నై మరో అదనపు బౌలర్‌ను ఎంచుకునేది. ఈ సీజన్‌లో అదనపు బౌలర్లు ఉన్న జట్లు బలంగా కనిపిస్తున్నాయన్నాడు. ధోని అత్యుత్తమ పినిషర్‌ అని.. 10 ఓవర్ల పాటు అతడు బ్యాటింగ్‌ చేస్తే.. సమస్యలు సర్దుకుపోతాయని చెప్పాడు.

తొలి మ్యాచ్‌లో ముంబైతో పోరులో గెలిచిన చెన్నై.. ఆ తరువాత రాజస్థాన్‌, దిల్లీ చేతుల్లో ఓటమిపాలైంది. ముంబైతో మ్యాచ్‌లో అంబటి రాయుడు అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆతరువాత అతడికి గాయం కావడంతో.. తరువాతి మ్యాచ్‌ల్లో బరిలోకి దిగలేదు. దీంతో చెన్నై టాప్‌ ఆర్డర్‌ బలహీనంగా మారింది. కాగా.. శుక్రవారం హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌కు రాయుడు అందుబాటులో ఉంటాడని.. అలాగే వెస్టిండిస్‌ స్టార్‌ డ్వేన్‌ బ్రేవో సైతం తుదిజట్టులో ఉంటాడని చెన్నై కోచ్‌ స్టీఫెన్‌ ప్లెమింగ్‌ చెప్పాడు. రాయుడు గనుక ఆడితే.. మురళీ విజయ్‌ను పక్కనపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే.. అతడు ఆడిన మూడు మ్యాచ్‌లో సరిగ్గా రాణించలేదు.

Next Story