ధోనికి గేమ్‌లో టచ్ పోయింది
By తోట వంశీ కుమార్ Published on 8 April 2020 7:58 AM GMTటీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని దాదాపు 8 నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్నాడు. ఐపీఎల్-13వ సీజన్‌లో సత్తాచాటి టీమ్ఇండియాలోకి ఘనంగా రీఎంట్రీ ఇవ్వాలని భావించిన ఈ కూల్‌కెప్టెన్‌కు కరోనా మహమ్మారి షాకిచ్చింది. కరోనా ముప్పుతో మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ ఏప్రిల్ 15కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితుల్లో 15 నుంచి టోర్నీ జరగడం అనుమానమే. ఒకవేళ ఐపీఎల్ రద్దయితే..? ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరులో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లోపు భారత్ జట్టులోకి ధోనీ రీఎంట్రీ ఇవ్వడం కష్టమే. అదే జరిగితే.. ధోనీ కెరీర్ ఇక ముగిసినట్లేనని కొంత మంది భారత మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
మహేంద్రసింగ్ ధోనీకి క్రికెట్‌లోనే కాదు.. ఫుట్‌బాల్‌లోనూ మంచి ప్రావీణ్యం ఉంది. బాలీవుడ్ నటులతో కలిసి ఛారిటీ మ్యాచ్‌లు ఆడటంతో పాటు.. జట్టుని గెలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలానే భారత క్రికెటర్లతో కలిసి ధోనీ పబ్‌జీ గేమ్‌ను ఆడుతుంటాడు. ఇటీవల ధోనీకి పబ్‌బీ గేమ్‌పై టచ్ పోయిందని టీమిండియా ఫాస్టు బౌలర్ దీపక్ చాహార్ అన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలోచెన్నై సూపర్‌కింగ్స్ దీపక్ చాహర్‌ను సరదాగా ఇంటర్య్వూ చేసింది. రెండు ఆప్షన్స్ ఇచ్చి ఏదైన ఒక దానిని ఎంచుకోమని, ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసింది. గేమ్స్‌లో టేబుల్ టెన్నిస్ లేదా పబ్‌జీ? అనే ప్రశ్నకు చాహర్ ఇలా సమాధానమిచ్చాడు. "పబ్‌జీ. ఇంకా ఆ గేమ్‌ను ఆడుతున్నా. కానీ ధోని ఆడట్లేదు. పబ్‌జీపై అతడికి పట్టు పోయింది. ఎక్కడి నుంచి ఎవరు కాలుస్తున్నారో కనిపెట్టలేకపోతున్నాడు. అతడు ఇప్పుడు మరో గేమ్ ఆడుతున్నాడు. కాల్ ఆఫ్ డ్యూటీతో బిజీగా ఉన్నాడు" అని చాహర్ తెలిపాడు.వీరిద్దరు చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే.
వాస్తవానికి 2019 వన్డే ప్రపంచకప్ ముగిసిన వెంటనే ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంతా ఊహించారు. కానీ.. ధోనీ మౌనంగా ఉండిపోవడంతో.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతనికి కనీసం వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా ఇవ్వలేదు. ఐపీఎల్ రాణించి జట్టులో చోటు దక్కించుకుంటాడని భావించిన ప్రస్తుతానికి ఆ అవకాశం లేదు. మరీ బీసీసీఐ ధోని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడక తప్పదు.