బీసీసీఐ కాంట్రాక్టులో ధోనికి దక్కని చోటు.. ఇక ధోని కెరీర్ ముగిసినట్లేనా..?
By Newsmeter.Network Published on 16 Jan 2020 3:20 PM ISTటీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి బీసీసీఐ( భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) ఝలక్ ఇచ్చింది. 2019-20 సీజన్‌కు సంబంధించి విడుదల చేసిన భారత క్రికెటర్ల కాంట్రాక్ట్ జాబితా నుంచి ధోని పేరును తొలగించింది. అసలు ఏ కేటగిరీలోనూ ధోనికి అవకాశం కల్పించలేదు. దీంతో కెరీర్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇక ధోనిని అంతర్జాతీయ మ్యాచుల్లో చూసే అవకాశం ఉండక పోవచ్చు అని పలువురు మాజీలు అంటున్నారు. 2019 ప్రపంచకప్ లో న్యూజిలాండ్ తో ధోని ఆఖరి సారిగా టీమిండియా జెర్సీలో కనిపించాడు.
ఎ+ గ్రేడ్‌లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రాలకు మాత్రమే అవకాశం ఇచ్చింది. ఇక ఎ-గ్రేడ్‌లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, చతేశ్వర పుజారా, అజ్యింకా రహానే, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, షమీ, ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్, రిషభ్ పంత్‌లకు చోటు కల్పించారు.
బి-గ్రేడ్‌లో వృద్ధిమాన్ సాహా, ఉమేశ్ యాదవ్, చహల్, హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్‌కు అవకాశం దక్కగా, సి-గ్రేడ్‌లో కేదార్ జాదవ్, నవదీప్ సైనీ, దీపక్ చాహర్, మనీష్ పాండే, హనుమ విహారి, శార్దూల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్‌లు చోటు దక్కించుకున్నారు. ఈ సీజన్ సమయంలో ఎ+ గ్రేడ్‌లో ఉన్న ఆటగాడికి రూ. 7 కోట్ల వరకూ బీసీసీఐ ఇస్తుండగా, ఎ-గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు రూ. 5 కోట్లు, బి-గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు 3 కోట్లు, సి-గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు ఒక కోటి చొప్పున లభిస్తుంది.
గతంలో ఎ+ గ్రేడ్‌ను ధోనికి కేటాయించిన సంగతి తెలిసిందే. మూడు ఫార్మాట్లూ ఆడే క్రికెటర్ కోసమే ఎ+ కేటగిరీని తీసుకురాగా, సుదీర్ఘ కాలంగా ధోని పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతూ వస్తున్నాడు. కాగా, ఈ నిబంధనను పక్కకు పెట్టిన బీసీసీఐ.. గత సీజన్‌లో ధోనికి ఎ+ గ్రేడ్‌ను కేటాయించింది. అయితే ఇప్పుడు ఎందులోనూ అవకాశం ఇవ్వకుండా ధోనిని తప్పించింది. దాంతో ధోని శకం ఇక ముగిసినట్లేనని బీసీసీఐ చెప్పకనే చెప్పేసింది.