పొలం దున్నిన ధోనీ.. వీడియో వైరల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jun 2020 9:57 AM GMT
పొలం దున్నిన ధోనీ.. వీడియో వైరల్

కరోనా కారణంగా క్రీడారంగం కుదేలైంది. పలు టోర్నీలు వాయిదా పడగా.. మరికొన్ని రద్దు అయ్యాయి. లాక్‌డౌన్‌ కారణంగా భారత క్రికెటర్లు ఇంటికే పరిమితం అయ్యారు. తమకు దొరికిన ఈ విరామాన్ని కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా కాలం గడుపుతున్నారు. ఇక చాలా మంది క్రికెటర్లు సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ కోవలో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ముందు ఉన్నారు. తాము లాక్‌డౌన్‌ కాలంలో ఏమేం చేస్తున్నామో అభిమానులతో పంచుకుంటున్నారు. కాగా.. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ రాంచీలోని తన ఫామ్‌ హౌజ్‌లో ఉంటున్నాడు. సోషల్ మీడియాకు ఎప్పుడు దూరంగా ఉంటాడు ధోని. తాను ఏం చేస్తున్నాడో ఎవ్వరికి పెద్దగా తెలీదు. కాగా.. లాక్‌డౌన్‌లో ధోని ఏం చేస్తున్నాడో అన్న సంగతి అతడి భార్య సాక్షి సింగ్ మాత్రం ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా ధోనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ధోని స్వయంగా ట్రాక్టర్‌ను నడుపుతున్నాడు. తన ఫామ్‌ హౌస్‌లో సేంద్రీయ వ్యవసాయ చేస్తున్నాడని గతంలో వినిపించినా.. తాజాగా ధోనినే స్వయంగా ట్రాక్టర్‌తో పొలం చదును చేసే వీడియో వెలుగులోకి వచ్చింది. డ్రైవింగ్ అంటే అమితంగా ఇష్టపడే ధోనీ.. స్వయంగా ట్రాక్టర్‌తో పొలం దున్నతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ కావడం ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది.

ఇక ధోని చివరి సారిగా భారత జట్టు తరుపున 2019 వరల్డ్‌కప్‌లో ప్రాతినిధ్యం వహించాడు. న్యూజిలాండ్‌తో సెమీఫైనల్‌లో ధోని చివరిసారి ఆడాడు. ఆతరువాత కొంతకాలం క్రికెట్‌ నుంచి విరామం తీసుకుని దేశసేవ చేశాడు. అనంతరం తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విహార యాత్రలు చేశాడు. ధోని రిటైర్‌మెంట్ ప్రకటిస్తారంటూ చాలాసార్లు వచ్చాయి. కానీ ధోని ఇప్పటి వరకు రిటైర్‌ మెంట్‌ గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఐపీఎల్‌ 2020 సీజన్‌లో రాణించి భారత జట్టులోకి ఘనంగా రీఎంట్రీ ఇవ్వాలని బావించాడు. అయితే..కరోనా కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ 13వ సీజన్‌ నిరవధికంగా వాయిదా పడింది. దీంతో ధోని కెరీర్‌ కూడా ప్రమాదంలో పడినట్లేనని పలువురు మాజీలు అంటున్నారు.

Next Story