కోహ్లీ సక్సెస్‌ సీక్రెట్‌ నాకు చెప్పాడు : హార్థిక్ పాండ్యా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jun 2020 1:35 PM GMT
కోహ్లీ సక్సెస్‌ సీక్రెట్‌ నాకు చెప్పాడు : హార్థిక్ పాండ్యా

ప్రస్తుతం క్రికెట్‌ ఆడేవారిలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ ఎవరు అంటే చాలా మంది ఠక్కున చెప్పే పేరు విరాట్‌ కోహ్లీ. ఫార్మాట్‌ ఏదైనా సరే.. ఈ భారత కెప్టెన్‌ పరుగుల వరద పారిస్తున్నాడు. చేధనలో అయితే.. అత్యుత్తమంగా ఆడతాడు. పరుగుల యంత్రంగా, రికార్డుల రారాజుగా కీర్తి గడిచాడు కోహ్లీ. ప్రపంచలో ఏ బౌలర్‌నైనా సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. మరీ కోహ్లీ అంతలా సక్సెస్‌ అవ్వడానికి కారణం ఏంటీ..? ఈ విషయం భారత ఆల్‌రౌండర్‌ హార్థిక్‌ పాండ్యాకు తెలుసుంట.

సొంత కష్టంతో అగ్రస్థానానికి చేరేందుకు కృషి చేయాలని, ఎవరినీ కిందికి నెట్టాలని అనుకోకూడదని విరాట్​ కోహ్లీ తనతో చెప్పాడని హార్దిక్ చెప్పాడు. రెండు రోజుల క్రితం భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో మాట్లాడానని, అప్పుడు అతడి విజయానికి కారణమేంటని అడిగానన్నాడు. నీ యాటిట్యూడ్ బాగుంది. ఆట బాగుంది. కానీ నిలకడ సాధించాలి అన్నాడు. సరైన మార్గంలో నంబర్ వన్ అయ్యేందుకు చాలా తపన పడాలి. కానీ ఎవరినీ వెనక్కి నెట్టాలని చూడకూడదు. స్వయంకృషితో, స్వశక్తితో అగ్రస్థానానికి చేరడమే లక్ష్యంగా పెట్టుకోవాలి అని కోహ్లీ నాతో చెప్పాడు అని హార్దిక్ తెలిపాడు.

విరాట్‌ ఎందుకంత నిలకడగా.. రాణిస్తున్నాడో తనకు అప్పడు అర్థమైందన్నాడు. ఇక హిట్‌మ్యాన్‌ రోహిశర్మ, మిస్టర్ కూల్‌ ధోని లాంటి ఆటగాళ్లు కూడా నెంబర్‌.2 స్థానాన్ని ఇష్టపడరని, ఒకవేళ వాళ్లు రెండో స్థానానికి పడిపోయినా.. దాన్ని పట్టించుకోరన్నాడు. మళ్లీ కష్టపడి అగ్రస్థానం చేరుకుంటారని వివరించాడు. అదే వాళ్ల గొప్పతనమన్నాడు.

Next Story