'మృగశిర కార్తె' ప్రాముఖ్యత
By సుభాష్ Published on 8 Jun 2020 12:45 PM ISTఈ రోజు నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానుంది. ఆశ్విని మొదలుకుని రేవతి వరకూ మనకున్న 27నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది. భారతీయ జ్యోతిష సాంప్రదాయం ప్రకారం.. ఒక్కో కార్తెలో ఒక్కో విధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించి నాటినుంచి నైరుతి రుతుపనాలు వస్తాయి. వాతావరణం ఒక్కసారి చల్లబడటం, ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలతో సతమతమవుతుంటారు. కార్తెలో వచ్చే నైరుతి రుతుపవనాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉపశమనం కలుగుతుంది. ఈ మృగశిర కార్తెలో రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా ఉంటుంటారు. ఏరువాక అంటే నాగటి చాలు. ఈ కాలంలో రుతుపవనాలు విస్తరించి తొలకరి వర్షాలు పడగనే రైతులు పొలాన్ని దున్ని పంటలు వేయడం ప్రారంభిస్తారు.
మృగశిర కార్తె అని పేరు ఎలా వచ్చింది..
చంద్రుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో 14 రోజుల పాటు ఉంటాడు. ఏ నక్షత్రంలో సమీపంలో ఉంటే ఆ కార్తెకు ఆ పేరు పెడతారు. అశ్వినితో మొదలై రేవతితో ముగిసే వరకూ 27 నక్షత్రాల పేర్లతో కార్తెలున్నాయి. ప్రస్తుతం మృగశిర నక్షత్రానికి చేరువలో చంద్రుడు ఉండటం వల్ల దీనికి మృగశిర కార్తె అనే పేరు వచ్చింది.
మృగశిర కార్తెను ఎలా జరుపుకొంటారు
మృగశిర కార్తె మొదటి రోజును దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర, మృగం, మిరుగు, మిర్గం అనే పేర్లతో పిలుస్తారు. ఈ రోజు ప్రజలు బెల్లంలో ఇంగువ కలుపుకొని తింటారు. ఇది శరీరంలో ఉష్ణోగ్రత ప్రేరేపించి వర్షాకాలంలో సోకే వ్యాధులను అడ్డుకుంటుందని పెద్దల విశ్వాసం. అంతేకాదు ఈ కార్తె రోజు చేపలు తప్పకుండా తింటారు.
ఈ కార్తె రోజు చేపలకు ఎందుకంత ప్రాముఖ్యత
మృగశిర కార్తె తర్వాత రోకండ్లను సైతం పగులగొట్టె ఎండలు తగ్గిపోతాయి. వర్షాలు మొదలవుతాయి. 15 రోజుల పాటు ఈ కార్తె ఉంటుంది. మృగశిర కార్తె చేపలు తినడాన్ని మన పూర్వీకుల నుంచి ఆనాదిగా వస్తోంది. ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో వేడి ఉండేందుకు చేపలను తింటారు. దీని వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఈ కార్తె రావడంతో వర్షాలు మొదలు కానున్న నేపథ్యంలో పలు వ్యాధులు వచ్చే అవకాశాలుంటాయి. ఈ సీజన్‌లో చాలా మందికి జీర్ణశక్తితోపాటు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. జ్వరం, దగ్గు బారిన పడతారు. ఇలాంటి నుంచి గట్టెక్కాలంటే చేపలు తినాల్సిందే. పూర్వీకులు శాఖాపరమైన ఇంగువను బెల్లంలో కలుపుకొని ఉండలు..ఉండలుగా చేసుకుని తినేవారు. మాంసాహారులైతే చేపలను ఇంగువలో, చింత చిరుగులో పెట్టుకుని తినేవారు. ఈ రోజు ఏ ఇంటా చూసినా చేపల పులుసే. చేపల కూర వంటకాలే కనిపిస్తుంటాయి.
(ఇది చదవండి: మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తింటారో తెలుసా..?)