అమరావతి రైతుల దీక్షకు మద్దతు తెలిపిన వైసీపీ ఎంపీ

By రాణి
Published on : 31 Jan 2020 6:19 PM IST

అమరావతి రైతుల దీక్షకు మద్దతు తెలిపిన వైసీపీ ఎంపీ

రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించరాదని, రాష్ట్రానికి మూడు రాజధానులు వద్దు..అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న రైతన్నలకు నరసరావు పేట వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మద్దతు తెలిపారు. మందడం, వెలగపూడి దీక్షా శిబిరాలకు వచ్చిన ఆయన దీక్ష చేస్తున్న రైతులందరికీ సంఘీభావం ప్రకటించారు. అనంతరం శ్రీకృష్ణ మాట్లాడుతూ... రాజధాని గురించి రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచినప్పుడు వచ్చి మీ అభిప్రాయాలు, సమస్యలను ప్రభుత్వానికి తెలపాల్సిందిగా ఎంపీ కోరారు. రాజధాని కోసం భూములిచ్చిన ప్రతి రైతుకు న్యాయం జరగాలని ఆయన ఆకాంక్షించారు.

తరతరాలుగా వచ్చిన ఆస్తులు మీ పంట పొలాలు. చెమటోడ్చి పంట పండించిన భూమి ని రాజధాని కోసం త్యాగం చేసిన మీకు...ఇప్పుడు రాజధాని ఉండదంటే భావోద్వేగం ఉంటుందన్నారు. రైతుల ఆందోళనను తాము అర్థం చేసుకోగలమని తెలిపారు. సీఎం జగన్ రైతుల పక్షపాతి అని, మీకు న్యాయం చేశాకే ఆయన ముందడుగు వేస్తారని భరోసా ఇచ్చారు. రైతులకు న్యాయం చేసే పూర్తి బాధ్యత తమదేనని శ్రీకృష్ణ తెలిపారు. రైతులకు సంఘీభావం తెలిపిన ఎంపీకి జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలుపుతూ...రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి..వాటిని పరిష్కరించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

Next Story