పోలీస్ బూటును ముద్దాడిన ఎంపీ గోరంట్ల
By సుభాష్ Published on 20 Dec 2019 12:30 PM ISTవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసు బూటును పాలీష్ చేసి ముద్దాడాడు. కాగా, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు గాను ఇలా వినూత్ననిరసన తెలిపారు. బూటును తుడిచిన ఎంపీ .. అనంతరం ముద్దాడాడు. ఇలా చేస్తున్నందుకు తాను గర్వపడుతున్నానని అన్నారు. జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యలపై ఎంపీ తప్పుబట్టారు. దేశాన్నికాపాడే పోలీసులపైనే జేసీ ఇలా దిగజారుడు మాటలు మాట్లాడాడని ఆరోపించారు. రక్షణగా ఉండే పోలీసులు పునర్జన్మ ఇస్తారని జేసీ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. భద్రత ఇచ్చేది పోలీసులేనని జేసీ గమనించాలని హితవు పలికారు.
ఇప్పటికే జేసీ దివాకర్‌రెడ్డి కథ ముగిసిందని, ఎన్నికల్లో ఆయన కొడుకు పని కూడా ముగిసిపోయిందని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, అలా ఉండడానికి పోలీసులేనని జేసీ గుర్తించుకోవాలన్నారు. ఇప్పటికైనా జేసీ దివాకర్ తన పద్దతి మార్చుకోవాలని, నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని గోరంట్ల హెచ్చరించారు. పోలీసులు అంటే ఏం మాట్లాడినా పట్టించుకోరని అనుకుంటారని, పోలీసుల నుంచి వచ్చిన వాళ్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందరో ఉన్నారని జేసీ గుర్తు పెట్టుకోవాలన్నారు. అలాగే తానూ అలాగే వచ్చి ఎంపీ అయ్యానని గోరంట్ల అన్నారు.
చంద్రబాబుకు నవ్వేలా వచ్చింది..
ఇక జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తుంటే చంద్రబాబుకు నవ్వేలా వచ్చిందని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉండి, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా ప్రవర్తించడం ఏంటన్నారు. చంద్రబాబుకు కూడా ఎస్పీజీ వాళ్లు రక్షణ కల్పిస్తున్నారని, పోలీసులపై జేసీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే చంద్రబాబు ఎందుకు స్పందంచలేదన్నారు. పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడితే కనీసం ఒక్కమాట కూడా మాట్లాడలేదని ఆరోపించారు.