15 నుంచి తెరుచుకోనున్న 'సినిమా థియేటర్లు'.. మార్గదర్శకాలివే..

By సుభాష్  Published on  6 Oct 2020 9:44 AM GMT
15 నుంచి తెరుచుకోనున్న సినిమా థియేటర్లు.. మార్గదర్శకాలివే..

కరోనా మహమ్మారి వల్ల ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌తో అన్ని రంగాలతో పాటు చిత్ర పరిశ్రమ సైతం మూతపడింది. ఇక దేశంలో అన్‌లాక్‌ 5.0 ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 15వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా సినిమా థియేటర్లు 50 శాతం సీటింగ్‌తో తెరుచుకోవచ్చని మార్గదర్శకాల్లో తెలిపింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. దాదాపు ఏడు నెలల తర్వాత అన్‌లాక్‌5.0లో భాగంగా అక్టోబర్‌ 15 నుంచి దేశ వ్యాప్తంగా సినిమా థియేటర్లు ఓపెన్‌ కానున్నాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. ప్రజలు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు.

కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు..

► థియేటర్లలోకి 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలి

► థియేటర్లలో భౌతిక దూరం పాటించడం తప్పనిసరి

► ఖాళీగా వదిలేసిన సీట్లపై మార్కింగ్‌ వేయాలి

► థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలి

► శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి

► అందరూ ఆరోగ్యసేతు యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకునేలా చర్యలు తీసుకోవాలి

► ఎక్కువగా ఆన్‌లైన్‌ పేమెంట్‌కే ప్రాధాన్యత ఇవ్వాలి

► టికెట్‌ కౌంటర్ల వద్ద, థియేటర్ పరిసరాల్లో, లోపల ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయాలి

► థియేటర్లలో ప్యాకేజ్‌ ఫుడ్‌ మాత్రమే అనుమతించాలి

► ఏసీ టెంపరేచర్‌ 23 డిగ్రీలపైన ఉండాలి

► థియేటర్లకు వచ్చిన ప్రతి ఒక్కరికి మాస్కులు తప్పనిసరి

Next Story