రిలీజ్, షూట్, ప్రమోషన్.. వాయిదా.. వాయిదా.. వాయిదా..!!!

By సుభాష్  Published on  7 March 2020 12:21 PM GMT
రిలీజ్, షూట్, ప్రమోషన్.. వాయిదా.. వాయిదా.. వాయిదా..!!!

ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమ కరోనా దెబ్బ ప్రభావాన్ని అంచనా వేస్తోంది. కరోనా వ్యాపించిన ప్రాంతాల్లో జనసమ్మర్దం లేకుండా చూసే యత్నాల్లో భాగంగా సినిమా హాళ్లల్లో ప్రదర్శనలను నిలుపు చేశారు. దీంతో సినీ పరిశ్రమకు సంక్షోభంలో కూరుకుపోయింది.

పలు సినీ ఫంక్షన్లు కరోనా భయంతో వాయిదా పడ్డాయి. ఉదాహరణకు ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ (ఇఫ్పా) అవార్డుల కార్యక్రమాన్ని కరోనా కారణంగా వాయిదా వేశారు. కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో, సినీ కళాకారులు, సినీ అభిమానుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన మేరకు ఇఫ్పా కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు . ఆఖరికి సినీ నటులు కూడా చాన్స్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఉదాహరణకు టైగర్ ష్రాఫ్ నటించిన బాగీ 3 టీమ్ సినీ ప్రమోషన్స్ లోభాగంగా ఢిల్లీలో కార్యక్రమాలు చేయబోమని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారట. ఢిల్లీలో కరోనా కేసులు నమోదు కావడమే ఇందుకు ప్రధానకారణం. నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన అంగ్రేజీ మీడియం సినిమా యూనిట్ కూడా ఢిల్లీ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంది.

తన తాజా చిత్రం రాధే కోసం సల్మాన్ తన మొత్తం యూనిట్ తో అజర్ బైజాన్ లో షూటింగ్ నిమిత్తం వెళ్లాల్సి ఉండగా, ఆయన కరోనా కారణంగా షెడ్యూలునే క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పడు ఆభాగాన్ని ఇండియాలోనే షూట్ చేస్తున్నారట. అక్షయ్ కుమార్ నటించిన బెల్ బాటమ్ తన లండన్ షూట్ ను క్యాన్సిల్ చేసుకుంది. అలాగే తఖ్త్ చిత్రం ఫారిన్ షూట్ కూడా క్యాన్సిల్ చేసేశారు. వికీ కౌశల్ నటిస్తున్న అశ్వత్థామ షూటింగ్ పరిస్థితి కూడా ఇంతే. ఇప్పుడు ఇండియాలోనే ఏదో ఒక లొకేషన్ వెతుక్కుంటున్నారట.

ఇక రిలీజులదీ ఇదే గతి. బాగీ 3 రిలీజు వాయిదా పడే సూచనలున్నాయి. ఎందుకంటే హిందీ సినిమాకి గల్ఫ్ ఒక పెద్ద మార్కెట్. అక్కడ ప్రస్తుతం కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రస్తుతం రిలీజ్ చేయకూడదని సినిమా యూనిట్ నిర్ణయించింది. అక్షయ్ కుమార్ సూర్యవంశి కూడా ఇప్పుడు అటా ఇటా అన్న సందేహంలో పడిపోయింది. కన్నడ, తమిళ ఇండస్ట్రీల్లోనూ ఇదే పరిస్థితి తాండవిస్తోంది.

Next Story
Share it