మెగా ఫ్యామిలీ పై సినిమా.. షాక్ ఇచ్చిన వర్మ..!
By న్యూస్‌మీటర్ తెలుగు
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. తన సినిమాలతో.. సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే వర్మ నిన్న రాత్రి ట్వీట్‌తో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంతకీ వర్మ ఏమని ట్వీట్ చేసాడంటే... మెగా ఫ్యామిలీ టైటిల్‌తో సినిమా చేయనున్నాను అంటూ ట్వీట్ చేసాడు. ఇక పూర్తి వివరాలను ఈ రోజు తెలియచేస్తానన్నాడు అంతే... వర్మ పై.. ఈ సినిమా పై ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్లు స్పందించారు.
మెగా ఫ్యామిలీలో ఎవరు నటిస్తారు..? కథ ఎలా ఉంటుంది..? ఎవర్నీ టార్గెట్ చేయనున్నారు..? ఇలా అనేక ప్రశ్నలు. ఇక మెగా ఫ్యాన్స్ అయితే... వర్మ పై తమదైన శైలిలో ఫైర్ అయ్యారు. పూర్తి వివరాలు ఈ రోజు చెబుతాను అన్నాడు కదా..? ఏం చెబుతాడో అని ఆసక్తిగా ఎదురు చూసిన వాళ్లకి వర్మ షాక్ ఇచ్చాడు. ఇంతకీ వర్మ ఏమన్నాడంటే... మెగా ఫ్యామిలీ అనే సినిమా 39 మంది పిల్లలున్న ఒక వ్యక్తి గురించి... అందుచేత ఈ సినిమా తీయలేను. ఎందుకంటే.. నేను పిల్లల సినిమాలను బాగా తీయలేను. అందుకే... ఈ సినిమా తీయకూడదని నిర్ణయించుకున్నాను అంటూ అసలు విషయాన్ని బయటపెట్టాడు. నిజంగానే మెగా ఫ్యామిలీతో సినిమా తీస్తాడనుకున్న వాళ్లు వర్మ ట్వీట్ చూసి షాక్ అయ్యారు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో..? ఏం చేస్తాడో..? అంతే మరి... వర్మ ఎవరికీ అర్ధం కాడు..!