నాలుగు నెలల పసిపాపను కాలువలో పడేసిన కసాయి తల్లి

By సుభాష్  Published on  18 Dec 2019 12:06 PM GMT
నాలుగు నెలల పసిపాపను కాలువలో పడేసిన కసాయి తల్లి

ఆడపిల్ల పుట్టిందంటే చాలు.. ఏదో తప్పు జరిగిపోయిందంటూ భావించే జనాలు ఇంకా మన మధ్యనే తిరుగుతున్నారు. దురదృష్టవశాత్తూ కొందరు మహిళలే ఆడపిల్లల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. రెండో కార్పులోనూ ఆడ పిల్ల పుట్టిందని ఆ తల్లికి అత్తింటి వేధింపులు అధికం కావడంతో కన్నతల్లి నాలుగు నెలల పసిగుడ్డును కాలవలోపడేసి అపై తాను ఆత్మహత్యకు యత్నించిన ఘటన కడప జిల్లా, మైలవరం మండలం గొల్లపల్లె సమీపంలో చోటు చేసుకుంది.

స్థానికుల కథనం ప్రకారం... కర్నూలు జిల్లా సంజామల మండలం పేరుసోమలకు చెందిన సుహాసినికి బనగానపల్లె మండలం పాతపాడుకు చెందిన నాగేంద్రతో ఏడేళ్ల కిందట వివాహమైంది. ఆ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు. పెద్ద కూతురు కీర్తన (5), చిన్న కూతురు జ్యోత్స్న (4 నెలలు). కీర్తన పుట్టినప్పటి నుంచే సుహాసినికి అత్తగారింటి వేధింపులు ఎక్కువయ్యాయి. రెండోసారి కూడా ఆడ పిల్లపుడితే సుహానిసిని వదిలించుకోవాలని అత్తింటివారు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక రెండోసారి కూడా ఆడ పిల్ల పుట్టడంతో అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి. ఇక వేధింపుల మధ్య తల్లడిల్లుపోతున్న ఆ తల్లి ఇద్దరి కూతుర్లో ఎవరినో ఒకరిని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నట్లు స్థానికుల ద్వారా సమాచారం.

మంగళవారం సాయంత్రం ఇద్దరు బిడ్డలతో మైలవరం మండలం గొల్లపల్లెకు చేరుకుంది. సమీపంలో ఉన్న రాళ్లవంక వద్దకు వెళ్లి నీటి ప్రవాహంలో చిన్నకుమార్తెను పడేసింది. కళ్ల ముందే కన్న కూతురు ఊపిరాడక ప్రాణాలు పోతుంటే తల్లడిల్లిన ఆ తల్లి కూడా అదే కాలువలో దూకపోయింది. ఈ విషయాన్ని పొలాల్లో ఉన్నవారు గమనించి పరుగెత్తుకుంటూ వచ్చి ఆమెను అడ్డుకుని, పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుహాసినిని అదుసులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story
Share it