హెల్మెట్ ధరించినా తప్పని మృత్యువు

By రాణి  Published on  18 Dec 2019 5:50 AM GMT
హెల్మెట్ ధరించినా తప్పని మృత్యువు

ముఖ్యాంశాలు

  • మహిళ ప్రాణాలను బలిగొన్న వాటర్ ట్యాంకర్
  • గుడి మల్కాపూర్ ఏరియాలో రోడ్డు ప్రమాదం
  • వెనుకనుంచి స్కూటర్ ని గుద్దేసిన వాటర్ ట్యాంకర్
  • వాటర్ ట్యాంకర్ డ్రైవర్ పై కేసు నమోదు

హైదరాబాద్ : ఆ మహిళ వయసు సుమారుగా 39 ఏళ్లు. జూబ్లీహిల్స్ లో ఉన్న ఆఫీస్ కు తన స్కూటర్ పై వెళ్తుండగా ఘోరమైన రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. మృత్యుశకటమై వచ్చిన ఓ ప్రైవేట్ మంచినీళ్ల ట్యాంకర్ గుడి మల్కాపూర్ దగ్గర ఆమె ప్రయాణిస్తున్న స్కూటర్ ని ఢీకొట్టడంతో బాధితురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రవణం ఝాన్సీ అనే మహిళ మానవవనరుల అభివృద్ధి నిపుణురాలు, ఇద్దరు పిల్లల తల్లి. విషయం తెలియగానే ఆమె బంధువులందరూ ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. విచిత్రం ఏంటంటే ప్రమాదం జరిగిన సమయంలో బాధితురాలు హెల్మెట్ పెట్టుకునే ఉందని పోలీసులు చెబుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో బాధితురాలు ఝాన్సీ (TS13 EJ 4260) తన స్కూటర్ పై ఆఫీస్ కు వెళ్తోంది. వెనకనుంచి వచ్చిన (AP12 V 7541) వేగంగా దూసుకొచ్చిన వాటర్ ట్యాంకర్ ఆమెను గుద్దేసి ముందుకు దూసుకుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బాధితురాలు హెల్మెట్ ధరించి ఉన్నప్పటికీ వాటర్ ట్యాంకర్ టైర్లు ఆమె తలమీదుగా దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లుగా పోలీసులు వెల్లడించారు. దారినపోయేవాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలి బ్యాగ్ లో ఉన్న వివరాలు, సెల్ ఫోన్ లో ఉన్న నెంబర్ల ఆధారంగా ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది.

స్కూటరే రోడ్డు మీద జారిపోయింది : ఎస్సై

తన ఇద్దరు పిల్లల్నీ స్కూలుకు పంపించి, పూజా పునస్కారం పూర్తి చేసుకుని, హడావుడిగా ఆఫీస్ కు బయలుదేరిన తన చెల్లెలు కనరాని లోకాలకు తరలిపోయిందంటే నమ్మలేకపోతున్నామంటూ మృతురాలి సోదరుడు రవణం వెంకటేశ్వరరావు గుండెలు అవిసిపోయేలా రోదిస్తున్నారు. ఝాన్సీ భర్త ఆర్. చంద్రమోహన్ హైదరాబాద్ లో ఒక జాతీయ దినపత్రికలో పనిచేస్తున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంలో ఎలాంటి స్పష్టతా లేదని ఆసిఫ్ నగర్ పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ చెబుతున్నారు. మృతురాలు వెళ్తున్న స్కూటరే రోడ్డు మీద జారిపోయిందని, ఆమె కిందపడిపోగానే వెనకాలే వస్తున్న వాటర్ ట్యాంకర్ వేగంగా ఆమెపై నుంచి దూసుకుపోయిందనీ చెబుతున్నారని ఆయన తెలిపారు.

మరికొందరు ఆమె తనదారిన తను వెళ్తుండగా వాటర్ ట్యాంకరే వేగంగా దూసుకెళ్లి వెనుక నుంచి ఆమెను ఢీ కొట్టిందని చెబుతున్నారని చెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతగానీ అసలు ప్రమాదం ఎలా జరిగింది అన్నదానిపై ఒక స్పష్టత రాదని పోలీసులు అంటున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఒక మృతికి కారణమయ్యాడంటూ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ మీద పోలీసులు కేసు నమోదు చేసి, అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో పోస్ట్ మార్టమ్ నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్టుగా పోలీస్ అధికారులు చెప్పారు.

Also Read

Next Story
Share it