కేరళ తాకిన రుతుపవనాలు.. 9 జిల్లాలకు హెచ్చరిక

By సుభాష్  Published on  2 Jun 2020 2:27 AM GMT
కేరళ తాకిన రుతుపవనాలు.. 9 జిల్లాలకు హెచ్చరిక

నైరుతి రుతుపవనాలు కేరళకు తాకాయి. దీంతో కేరళలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. కేరళలోని మొత్తం 9 జిల్లాల్లో ఎల్లో అలర్డ్‌ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. తిరువనంతపురం, కొట్టాయం, పాతనమిట్టం, అలప్పుజా, కొల్లాం, ఎర్నాకుళం, ఇడుక్కి, కన్నూరు, మల్లపురం జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు.

అనుకున్నట్లు సాధారణ తేదీల ప్రకారం.. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల వల్ల దేశ వ్యాప్తంగా జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో 75శాతం వర్షాలు పడే అవకాశాలుంటాయని తెలిపారు. అరేబియా సముద్రంలో నిసర్గ తుఫాను ఏర్పడటంతో నైరుతి రాక సునాయాసంగా మారినట్లు ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ ఏడాది వందశాతం సాధారణ వర్షపాతం ఉండే అవకాశాలున్నట్లు, ఏప్రిల్‌లోనూ కేంద్ర భుగర్భ మంత్రిత్వశాఖ కార్యదర్శి మాధవన్‌ రాజీవన్‌ తెలిపారు.

ప్రస్తుతం కేరళ రాష్ట్రం అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం వరకూ ఈ వానలు రాష్ట్రమంతటా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల రెడ్‌ అలర్ట్‌ కూడా ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జూన్‌ 3 సాయంత్రం నాటికి భూమికిపైకి వస్తుందని చెబుతున్నారు. ఆ సమయంలో గంటకు 110కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వెల్లడిస్తున్నారు. ఆ రెండు రాష్ట్రాలతోపాటు గోవాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్ఆరు. ముంబైలో కొద్దిపాటి వర్షాలు కురియనున్నాయన్నారు.

Next Story