అంద‌రూ చేయి చేయి క‌లిపి న‌డిస్తేనే అది భార‌తీయ‌త‌..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Dec 2019 3:41 PM GMT
అంద‌రూ చేయి చేయి క‌లిపి న‌డిస్తేనే అది భార‌తీయ‌త‌..!

జాతి సంతోషం కోసం ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో ఏకమవ్వాల‌ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపుఇచ్చారు. హైద్రాబాద్ న‌గ‌రంలోని సరూర్‌నగర్ స్టేడియంలో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ త‌ల‌పెట్టిన‌ విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. అంద‌రూ సమానులేనని.. అంతా చేయిచేయి కలిపి నడిస్తేనే అది భారతీయత అవుతుందన్నారు. అటువంటి స్వభావం మన మట్టిలోనే ఉందని ఆయ‌న‌ పేర్కొన్నారు.

మ‌తాలుగా, వ్య‌క్తులుగా సంప్రదాయాలు, నమ్మకాలు ఎన్నైనా ఉండవ‌చ్చని, దేశం విషయంలో మాత్రం అందరూ ఒకేలా ఆలోచించడమే భారతీయతని.. ఈ విష‌యాన్ని ఆర్ఎస్ఎస్ బ‌లంగా న‌మ్ముతుంద‌న్నారు. భార‌త‌దేశ వికాసమే అందరి లక్ష్యం కావాలని ఆయ‌న‌ అన్నారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు, దేశాన్ని మార్చలేవని ఆయ‌న అన్నారు.

సమాజమంతా కలిసి నడవాలన్నదే హిందూత్వ విధానమని ఆయ‌న అన్నారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కూడా అదే చెప్పారని గుర్తుచేశారు. దేశం కోసం త్యాగాలు చేసేందుకు మ‌నం సిద్ధపడ్డ‌ప్పుడే మార్పు సాధ్యపడుతుందని.. ఆర్ఎస్ఎస్ కూడా అలాంటి మార్పుకోసమే ప్రయత్నిస్తుందని మోహన్ భగవత్ అన్నారు

హిందూ సమాజ ఆశయాన్నే... భారతదేశం, విశ్వ గురువుగా ప్రపంచానికి దారి చూపాలని.. భూమి, నీరు, అడవులు, జీవజాలం అన్నింటిపై సమదృష్టితో పరిరక్షించడమే ఆర్ఎస్ఎస్ విధానమని మోహన్ భగవత్ అన్నారు. నీవు ఎవ‌రిని పూజించినా.. నీ విశ్వాసం ఏదైనా కావొచ్చు.. మీరు ఈ మాతృభూమిలో పుట్టారంటే భరతమాత బిడ్డలే అని అన్నారు. అలాగే.. మీరు ముక్కోటి దేవతలను పూజించక్కర్లేదు.. భరతమాతను పూజించండి.. దేశం కోసం అంకితమవ్వండి.. అలాంటి ఆలోచనా ధోరణికి మించిన స్వర్గం లేదని వివేకానందుడి మాట‌ల‌ను గుర్తుచేశారు.

Next Story