బోదిధర్ముడు పుట్టిన గడ్డ పై మోడి - జింపింగ్ భేటి!

By సత్య ప్రియ  Published on  11 Oct 2019 10:00 AM GMT
బోదిధర్ముడు పుట్టిన గడ్డ పై మోడి - జింపింగ్ భేటి!

చైనా, భారత్ ఆసియాలోనే శక్తివంతమైన దేశాలు. అటువంటి రెండు దేశాల అధ్యక్షులు కలిసి రెండు రోజుల పాటు చర్చలు సాగించబోతున్నారు. ప్రపంచ దేశాలన్నీ ఈ సమావేశం వైపు ఆసక్తిగా చూస్తున్నాయి.

అయితే, అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం ఒక్కటే, ఇంత ప్రతిష్ఠాత్మకమైన సమావేశం తమిళ నాడులోని మామ్మలపురంలో జరిపించడానికి కారణం ఏంటి? అసలు ఈ ప్రాంతానికి ఉన్న విశిష్టత ఏమిటి?

Modi Jinping meet at Mammalapuram

ప్రాచీన భారతీయశిల్పకళా నైపుణ్యాన్ని, ఆనాటి పల్లవ రాజుల ఘనమైన చారిత్రక కళా సంపదను తరతరాలుగా పర్యాటక లోకానికి పంచిపెడుతున్న రాతి గోపురాల సముద్ర తీర పట్టణమే మహాబలిపురం.

పల్లవరాజుల పరిపాలనలో ఈ ప్రాంతం ఎంతో వైభవోపేతంగా విరాజిల్లింది. మహాబలిపురం ఒకనాడు స్వర్ణయుగంగా వెలుగులు విరజిమ్మింది.

కాంచీపురం జిల్లాలో ఉన్న మహాబలిపురాన్ని పూర్వం 'మామల్లపురం'గా పిలిచేవారు. “మమ్మలన్ “ అంటే యోధుడు అని అర్ధం. క్రీస్తుశకం 7వ శతాబ్ధం నుంచి 10 వ శతాబ్ధం మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పల్లవ రాజులు పాలించారు. పల్లవ రాజుల కాలం (700-728 ఎడి) నాటి పల్లవ రాజసింహ (నరసింహ-2) హయాంలో శోర్ శివాలయం నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పల్లవ రాజు నరసింహవర్మన్-1 ఏక శిల రాతితో ఐదు రథాల్ని తయారు చేయించినట్లు చెబుతారు.

ఆ కాలంలో పేరు పొందిన ఓడ రేవు ఇది. పల్లవ రాజుల రెండవ రాజధానిగా ఉండేది. ఆనాటి పాలకులు విదేశీ నిపుణులను రప్పించి, స్వదేశీ శిల్పకళాకారుల సాయంతో సాగర తీరంలోని ఈ మహాబలిపురంలో అద్భుత రాతి కట్టడాలను నిర్మించారు. ఆ కళాత్మక హృదయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందనే చెప్పాలి.

Mahabalipuram Shore Temple

కేవలం ఒకే ఒక పెద్ద రాతి నుంచి నిర్మించిన ఆలయాలను ఇక్కడ గమనించవచ్చు. ముందుగా రెండు పెద్ద గోపురాలు పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తాయి. భారతీయ పురాణగాధలు, పాత్రలను తలపించే శిల్పాలను ఎన్నింటినో వాటిపైన చూడొచ్చు. అనేక దేవతలు, దేవుళ్ల విగ్రహాలతోపాటు పలువురు నృత్య కళాకారిణుల విగ్రహాలు, పెద్ద అంగలు వేసే ఏనుగుల భారీ శిల్పాలు వంటివి అన్నీ సందర్శకులను నిల్చున్నచోటే కట్టి పడేస్తాయి. అలాగే, అక్కడి చిన్నగోపురాలను చూడొచ్చు. ఈ ఆలయంలో ప్రధాన దేవతలుగా శివకేశవుల విగ్రహాలు ఉన్నాయి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆలయం చుట్టూ అనేక నంది విగ్రహాలు బారులు తీరి సరిహద్దు గోడలా చెక్కారు. ఆలయం వెనుక ఓ పెద్ద రాతి సింహం, దానిపై ఒక సైనికుడు స్వారీ చేస్తున్నట్లు అద్భుతంగా మలిచారు. ఇది ఆనాటి సైనికుల స్థయిర్యాన్ని, ధైర్యాన్ని చాటిచెబుతుంది.

మహాబలిపురం పట్టణానికి ఉత్తరంవైపు పెద్ద రాతి రథాలు ఐదు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటీ ఒక్కో భారీ ఏకశిలా ఖండంగా రూపొందిం చడం విశేషం. మహాభారతంలోని పంచపాండవుల ఐదుగురి పేర్లు వీటికి పెట్టారు. ఇక సముద్రతీరానికి 400 మీటర్ల దూరంలో ఒక గ్రానైట్‌ కొండపైన గల గుహాలయాలు సందర్శించాం. వీటిలో ప్రముఖమైనది 'వరాహమండపం'. ఈ చిన్న గుహను చెక్కిన తీరు అనన్య సామాన్యం. దీని ధ్వజస్తంభాల వద్ద ఎంతో అందంగా చెక్కిన సింహాల విగ్రహాలు ఉన్నాయి. కేవలం నిర్మాణాత్మక సొబగులే కాకూండా ఇక్కడ చూడదగ్గ విశేషాలు అనేకం ఉన్నాయి. యునెస్కో దీనిని ప్రపంచపర్యాటక స్థలాల్లో ఒకటిగా గుర్తించింది.

Modi Jinping meet at Mammalapuram

క్రి.పూ. 6వ లేదా 7వ శతాబ్దాల్లో ఇక్కడికి చైనా నుంచి ఎందరో పర్యాటకులు వచ్చేవారట. అందులో హ్యోన్ సాంగ్ ఒకరు. ఈ ప్రదేశం ఎంతో సుభీక్షంగా ఉన్నప్పుడు చైనీయులు దీనిని సందర్శించేవారని చెప్తారు. ప్రపంచప్రఖ్యాతుడైన బోదిధర్ముడు కూడా పల్లవ వంశానికి చెందినవాడని అంటారు.

Modi Jinping meet at Mammalapuram

ఈ చారిత్రక ప్రాంతంలో మోదీ, జీ జిన్‌పింగ్ భేటీ అవ్వడమే కాదు... శోర్ శివాలయ పరిసరాల్లో తిరుగుతారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తారని తెలిసింది. అలాగే ఇక్కడి ఐదు చారిత్రక రథాల్ని కూడా చూస్తారని చెబుతున్నారు. ఇక్కడి ఓ బెంచీపై కూర్చొని, మీడియాకు ఫొటోలు తీసుకునే ఛాన్స్ ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి వినూత్న సమావేశాల ఫలితాలు ఎలా ఉన్నా... వీటివల్ల 'మామల్లపురం' ప్రపంచప్రఖ్యాతి గాంచిందనే చెప్పాలి.

Next Story