విద్వేషం వెళ్లగక్కిన ఇమ్రాన్...శాంతియుత జీవనం ముఖ్యమన్న మోదీ..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Sep 2019 7:22 AM GMT- యూఎన్ఓలో మోదీ, ఇమ్రాన్ ప్రసంగం
- ప్రపంచ శాంతిని కాంక్షించిన ప్రధాని మోదీ, భారత్‌పై విషం కక్కిన ఇమ్రాన్
- అభివృద్ధిని ప్రస్తావించిన మోదీ, ఉగ్రవాదం గురించి మాట్లాడిన పాక్ ప్రధాని
- మానవజాతి బాగుండాలన్న భారత ప్రధాని, కశ్మీర్ గురించే ఎక్కువ మాట్లాడిన మాజీ క్రికెటర్
- కశ్మీర్ పై సెల్ఫ్ వికెట్ అయిన ఇమ్రాన్
- ఇమ్రాన్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారన్న విశ్లేషకులు
అమెరికా: ఐక్యరాజ్యసమితి వేదిక గా భారత ప్రధాని మోడి, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లు ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరు కు అందరూ ఏకమవ్వాలని మోడి పిలుపునివ్వగా... ఇమ్రాన్ ఖాన్ మాత్రం కాశ్మీర్ విషయంలో భారత్ పై దూషణ కి దిగారు.
ఉగ్రవాదం ఏ ఒక్క దేశానికో పరిమితమైన సమస్య కాదని, ప్రపంచ దేశాలన్నింటిని కలవరపెడుతోందన్నారు మోడి. శాంతి, సామరస్యాలే ప్రపంచానికి భారత్ ఇచ్చే సందేశమన్నారు. 125 ఏళ్ల క్రితం అమెరికా లో స్వామి వివేకానంద ఇచ్చిన శాంతి సందేశాన్ని గుర్తు చేసారు. ప్రాచీన సంస్కృతిని పునాదిగా చేసుకొని భారత్ ముందుకు దూసుకుపోతోందని ఆయన చెప్పారు.130 కోట్ల మంది భారతీయుల ప్రతినిధిగా మాట్లాడే అవకాశం రావడం తన అదృష్టమన్నారు ప్రధాని మోదీ.
"జీవుడిలో దేవుడిని చూడడం భారతీయ సంస్కృతి, భారత్ ప్రపంచ కలలను తమ కలలుగా చూస్తుంది. అదే స్పూర్తితో ' సబ్కా సాత్, సబ్కా వికాస్ ' నినాదంతో ముందుకెళ్తోంది. అందరి కలలను నెరవేర్చేందుకు భారత్ కృషి చేస్తుందన్నారు" ప్రధాని మోదీ.
ఐదేళ్లలో 11 కోట్ల టాయిలెట్లు నిర్మించామన్నారు మోదీ. అక్టోబర్ 2 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నామని చెప్పారు. 15 కోట్ల కుటుంబాలకు రక్షిత మంచినీటిని అందిస్తున్నామన్నారు. 2022 నాటికి పేదలకు 2 కోట్ల ఇళ్లు నిర్మించి ఇవ్వబోతున్నట్లు తెలిపారు. తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు యావత్ ప్రపంచానికి ఓ కొత్త ఆశగా అభివర్ణించారు ప్రధాని.
భారత్‌పై విషం కక్కిన ఇమ్రాన్
ప్రధాని మోడి పై పాక్ ప్రధాని ఇమ్రాన్ విమర్శలు గుప్పించారు. భారత్ పై నిందలు వేశారు. తన ప్రసంగంలో ఎక్కువ భాగం ఆయన కాశ్మీర్ పైనే మాట్లాడారు. కాశ్మీర్ లో కర్ఫ్యూని ఎత్తివేయాలన్నారు. నిర్బంధంలో ఉన్నవారిని విడుదల చేయాలని చెప్పారు. కశ్మీర్ కు స్వయం నిర్ణయాధికారం కల్పించాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితి ముందు ఉందన్నారు ఇమ్రాన్.
ప్రధాని మోడి, ఆర్.ఎస్.ఎస్ పైన తీవ్ర విమర్శలు చేశారు. అహంకారంతో మోడి కళ్లు మూసుకుపోయాయి అంటూ ప్రసంగించారు. భారత్ ధోరణి వల్లే ఉగ్రవాదులు తయారవుతున్నారన్నారు. అందులో పాక్ పాత్ర ఏమీ లేదంటూ సమర్ధించుకున్నారు ఇమ్రాన్.
ఇమ్రాన్ ఇస్లాం, ఉగ్రవాదాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి ఇస్లామోఫోబియా (ఇస్లాం అంటే భయం) వ్యాపించిందన్నారు. కొంతమంది పాశ్చాత్య దేశాల నాయకులు ఉగ్రవాదాన్ని, ఇస్లాం ను ఒకటి చేసి చూడడం ఇస్లామోఫోబియా కి కారణమన్నారు. ఏ మతమూ హింస ను ప్రోత్సహించదని చెప్పారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.
ఐక్యరాజ్య సమితి సాక్షిగా భారత్ శాంతి మంత్రాన్ని జపిస్తే..పాక్ మాత్రం హింసామంత్రాన్ని జపించింది. మోదీ అభివృద్ధి, ప్రపంచ శాంతి గురించి మాట్లాడితే ..ఇమ్రాన్ భారత్‌ను రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడారు. మొత్తానికి పాక్ డిఫెన్స్‌లో ఉందని, ఇమ్రాన్ తీవ్ర ఒత్తిడి మధ్య నలిగి పోతున్నారని ఇమ్రాన్ ప్రసంగం విన్న విశ్లేషకులు అంటున్నారు.