మొబైల్ లో చాటింగ్ చేస్తే యాక్సిడెంట్ ఖాయం

By రాణి  Published on  7 Feb 2020 1:06 PM GMT
మొబైల్ లో చాటింగ్ చేస్తే యాక్సిడెంట్ ఖాయం

ముఖ్యాంశాలు

  • పాదచారులకు రోడ్ యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతాయి ?
  • రోడ్డులో ఏం వస్తుందో సరిగ్గా చూసుకోనందువల్ల..
  • రోడ్లో ఏం వస్తుందో ఎందుకు చూసుకోరు ?
  • ఎందుకంటే వాళ్లు సెల్ ఫోన్లో బిజీ..
  • సెల్ ఫోన్లో బిజీ అయితే ఏమవుతుంది ?

వాళ్లు కుడీ ఎడమా చూడరు. ముందూ వెనుకా చూడరు. ముఖ్యంగా నడుస్తూ మొబైల్ లో టెక్స్ట్ మెసేజీలు పంపుకునేవారికి ఇంకా పెద్ద ప్రమాదం ఉంది. ఇటీవల గచ్చిబౌలిలో కిందకు పడిన ఫ్లై ఓవర్ ఓ సైన్ బోర్డు మీద పడింది. సైన్ బోర్డు మిసైల్లా దూసుకొచ్చి ఒక అమ్మాయిని ఆల్మోస్ట్ తాకబోయింది. అమ్మాయి సెల్ ఫోన్లో మెసేజీలు పంపుకుంటూ మహా బిజీగా ఉంది. ఎవరో అరిస్తే ఆమె చూసి ఎలాగోలా ఆ సైన్ బోర్డ్ బారిన పడకుండా తప్పించుకుంది. గుర్తుండే ఉంటుంది కదూ....అలా ప్రమాదాలు మొబైల్ లో టెక్స్టింగ్ వల్లే జరుగుతున్నాయి. కెనడాలోని కాల్గరీ యూనివర్శిటీ అధ్యయనం ప్రకారం ఏటా 2.70 లక్షల మంది పాదచారులు మొబైల్ లో మెసేజీలు పంపుకుంటూ ముందు వెనుక చూడకుండా వచ్చేయడం వల్ల ప్రమాదాల్లో చనిపోతున్నారని తేల్చింది.

అయితే ఈ అధ్యయనంలో పాటలు వింటూ వెళ్తే పెద్ద ప్రమాదం ఏదీ లేదని తేలింది. వీడియోలు చూస్తున్నా, టెక్స్ట్ మెసేజీలు పంపుతున్నా చుట్టుపక్కల చూసేందుకు వీలుండదని, అలాంటి వారే ఎక్కువగా ప్రమాదాల బారిన పడతారని ఈ అధ్యయనం తేల్చింది. ఇలా మొబైల్ టెక్స్టింగ్ వల్ల ధ్యాస లేకుండా పోయి ఢీకొన్ని ప్రమాదాల బారిన పడేవారి సంఖ్య పెరుగుతూండటం పట్ల అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది.ఇలాంటి వారి వల్ల 12 నుంచి 48 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని అధ్యయనం చెబుతోంది.

కాబట్టి రోడ్డు మీద నడిచేప్పుడు మొబైల్ విషయంలో తస్మాత్ జాగ్రత్త అంటోంది ఈ అధ్యయనం. నడిచేటప్పుడు టెక్స్టింగ్ చేయకండి. విడియోలు చూడకండి. రాముడు మంచి బాలుడిలా కుడీ ఎడమా ముందూ వెనుకా చూసి నడవండి. నూరేళ్లు బ్రతకండి.

Next Story