జగన్ కేబినెట్ లో రోజాకి స్థానం !?
By రాణి
నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్కే రోజాకి జగన్ కేబినెట్ లో స్థానం దక్కబోతుందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. సోమవారం ఉదయం రోజా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసి, రాష్టంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా..ఏపీ మండలి రద్దైతే జగన్ కేబినెట్ లో ఇద్దరు తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేయాల్సి ఉంటుంది. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు ఎమ్మెల్సీలుగా ఎన్నికై మంత్రి పదవులు పొందారు. మండలి రద్దైతే ఎమ్మెల్సీలు ఉండవు. ఎమ్మెల్సీ పదవి లేకుండా వారిద్దరూ మంత్రులుగా కొనసాగేందుకు వీల్లేదు కాబట్టి...వీరిద్దరి రాజీనామా అనివార్యంగా కనిపిస్తోంది.
గతంలో ఎమ్మెల్యే రోజా తనకు మంత్రి పదవి ఇవ్వలేదని ప్రభుత్వంపై అలకబూనారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఆమె కొద్దిరోజులు ఎవరికీ కనిపించలేదు. తర్వాత తాను ఏం అలగలేదని, వ్యక్తిగత పనులతో బిజీ ఉండటం వల్ల ప్రజలకు అందుబాటులో ఉండలేకపోయానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వైసీపీకి రోజా అలకను తీర్చే అవకాశం వచ్చింది. ఈ ఇద్దరు మంత్రుల రాజీనామాలు ఖాయమైతే..వారిలో ఒకరి స్థానాన్ని రోజా భర్తీ చేయనున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మండలి రద్దైతే రోజాకు మంత్రి పదవి ఖాయమైనట్లేనని గుసగుసలు వినపడుతున్నాయి. చూడాలి..రోజా వికసిస్తుందో...లేక వాడిపోతుందో.