చంద్రబాబు, లోకేష్ జైలుకెళ్లడం ఖాయం: రోజా
By సుభాష్ Published on 27 Feb 2020 9:02 PM IST
ఏపీ నగరి ఎమ్మెల్యే రోజా గురువారం శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం మల్లన్న అందరిని చల్లగా చూస్తారని, ముఖ్యమంత్రి జగన్ సారధ్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోనున్నదని చెప్పుకొచ్చారు. ఇక చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఐదు సంవత్సరాల పాలనలో ఎప్పుడు ఏడుపేనని, చంద్రబాబు వల్ల రాష్ట్రం అప్పులలో కూరుకుపోయిందని ఆరోపించారు. జగన్ 9 నెలల పాలనలో ఇచ్చిన హామీలను తీర్చే విధంగా ముందుకెళ్తున్నారన్నారు.
దేశం మొత్తం ఏపీ రాష్ట్ర పథకాల వైపు చూస్తోందని, ఏపీలో జగన్ అమలు చేస్తున్న పథకాల గురించి వివిధ రాష్ట్రాల వాళ్లు చర్చించుకుంటున్నారన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని రూ.3 లక్షల కోట్ల మేరకు అప్పుల పాలు చేశారని, చేసిన తప్పులకు చంద్రబాబు, లోకేష్, కేబినెట్‌లో పని చేసినవారంతా త్వరలో జైలుకెళ్తారని జోస్యం చెప్పారు. చంద్రబాబు కార్యాలయాల మీద ఐటీ దాడులు జరుగుతుండే ఎందుకు భయపడుతున్నారని రోజా ప్రశ్నించారు.