కరోనా మహమ్మారి కారణంగా దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఎవ్వరు కూడా లాక్‌డౌన్‌ ఉల్లంఘించినా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఆంధ్రా-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ ఐదు వాహనాల్లో తన బంధువుల, అనుచరులతో తీసుకురావడం సంచలనంగా మారింది. ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే అయిన మధుసూదన్‌ లాక్‌డౌన్‌ ఉల్లంఘించడమే కాకుండా పోలీసులతో సైతం వాగ్వివాదానికి దిగారు.

బెంగళూరు నుంచి 39 మంది తన అనుచరులను ఎమ్మెల్యే ఆంధ్రా సరిహద్దుకు తీసుకువచ్చారు. ఎమ్మెల్యేతో పాటు ఐదు వాహనాలు చిత్తూరు జిల్లా మధనపల్లె సమీపంలో చీకలబైలు చెక్‌పోస్టు వద్దకు రాగానే పోలీసులు వారిని అడ్డుకున్నారు. లాక్‌డౌన్‌ ఉన్న కారణంగా రాష్ట్ర సరిహద్దు దాటి వెళ్లేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో ఎమ్మెల్యే పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.

నేను అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేను.. నేను చెబితే కూడా వినరా..? అంటూ పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు. ముందే లాక్‌డౌన్‌ ఉంది.. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తాము అడ్డుకుంటున్నామని, సరిహద్దు దాటి జిల్లాలోకి వెళ్లడం కుదరదని పోలీసులు తెలిపారు.

ఈ విషయం మదనపల్లి డీఎస్పీకి తెలుపడంతో ఆయన వచ్చి ఎమ్మెల్యే నచ్చజెప్పారు. ఒక వేళ రాష్ట్రంలోకి వచ్చినా 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో చేసేదేమి లేక ఎమ్మెల్యే అనుచరులతో కలిసి కర్ణాటక వెళ్లిపోయారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.