హైదరాబాద్‌: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో ఊరట లభించింది. కేంద్ర హోంశాఖ రద్దు చేసిన చెన్నమనేని రమేష్‌ పౌరసత్వంపై హైకోర్టు ఎనిమిది వారాల పాటు స్టే విధించింది. కాగా చెన్నమనేని రమేష్‌కు జర్మనీ, భారతీయ పౌరసత్వం ఉందని పిటిషన్‌ కోర్టుకు తెలిపారు. ఇప్పటికే జర్మనీ పౌరసత్వం రద్దు చేసుకున్నాడని చెన్నమనేని రమేష్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రెండు పౌరసత్వాలకు సంబంధించిన ఆధారాలు చూపించాలని పిటిషన్‌ర్‌కు హైకోర్టు సూచించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలన్న హైకోర్టు.. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

భారత పౌరసత్వం కోసం చెన్నమనేని రమేష్ మార్చి31, 2008న దరఖాస్తూ చేసుకున్నారు. సెక్షన్ 5 (1) (ఎఫ్) ప్రకారం దరఖాస్తూ చేసుకోవడానికి ముందు ఏడాది భారత్‌లో నివాసం ఉండాలి. ఈ విషయంలో చెన్నమనేని తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. నవంబర్‌ 21, 2008న 12 నెలల్లో విదేశాలకు వెళ్లిన వివరాలను ఇవ్వాలని హోంశాఖ చెన్నమనేనిని కోరింది. తాను విదేశాలకు వెళ్లలేదని చెన్నమనేని నవంబర్ 27, 2011న చెన్నమనేని కేంద్ర హోంశాఖకు సమాధానం ఇచ్చారు. ఫిబ్రవరి 4, 2009న కేంద్ర హోంశాఖ చెన్నమనేనినికి భారత పౌరసత్వాన్ని ఇచ్చింది. దీనిపై శ్రీనివాస్‌ 2009లో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ కొనసాగించిన కేంద్ర హోంశాఖ..తప్పుడు సమాచారంతో చెన్నమనేని పౌరసత్వం పొందారని నిర్ధారించింది. దీంతో ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.