నెటిజన్‌ నోరు మూయించిన మిథాలీరాజ్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Oct 2019 12:30 PM GMT
నెటిజన్‌ నోరు మూయించిన మిథాలీరాజ్‌

సోషల్‌ మీడియా: తనపై తరచూ ట్రోలింగ్‌ చేస్తున్న ఓ నెటిజన్‌కు టీమిండియా మహిళా వన్డే జట్టు కెప్టెన్‌ మిథాలి రాజ్‌ గట్టి సమాధానమిచ్చి నోరు మూయించింది. అయితే ఇటీవల మహిళా జట్టు దక్షిణాఫ్రికాపై 3-0 తేడాతో వన్డే సిరీస్‌ గెలిచిన సందర్భంగా లెజెండరీ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ మిథాలీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ట్విటర్‌లో అభినందనలు తెలియజేశారు. అందుకు మిథాలి ప్రతిస్పందించి.. చిన్నప్పటి నుంచీ చూస్తూ పెరిగిన క్రికెట్‌ దిగ్గజం తనని అభినందించడం సంతోషంగా ఉందని ఓ ట్వీట్‌ చేసింది. అయితే ఈ ట్వీట్‌కు స్పందించిన నెటిజన్‌.. మిథాలీరాజ్‌ మాతృభాష తమిళం అయినా ఎప్పుడూ ఆ భాష మాట్లాడదని, ఇంగ్లీష్‌, తెలుగు, హిందీ భాషల్లోనే మాట్లాడుతుందని ట్రోల్‌ చేసింది. మిథాలీకి అసలు మాతృభాష రాదని ఎద్దేవా చేసింది. దీంతో టీమిండియా కెప్టెన్‌ సమాధానమిస్తూ ‘నా మాతృభాష తమిళమే. నేను ఈ భాషను బాగా మాట్లాడుతా. ఒక తమిళ వ్యక్తిగా జీవించడం గర్వపడుతున్నా. అన్నిటికన్నా ముఖ్యంగా గౌరవప్రద భారతీయురాలిగా ఉంటా. నా ప్రతీ పోస్టుకు స్పందించే మీ మాటలను, సలహాలుగా తీసుకొని ముందుకుసాగుతా’అని జవాబిచ్చింది. ఈ సందర్భంగా ఆ నెటిజన్‌కు టేలర్‌ స్విఫ్ట్‌ పాటను ఒకటి షేర్‌ చేసింది మిథాలీరాజ్‌.

Next Story