బీసీసీఐ ప్రెసిడెంట్‌కు ఛాలెంజ్ విసిరిన క్రికెటర్ మిథాలీ రాజ్
By Newsmeter.Network Published on 23 Dec 2019 10:40 AM ISTహైదరాబాద్: మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రముఖ భారత మహిళ క్రికెటర్ మిథాలీ రాజ్ అన్నారు. పచ్చని చెట్లు లేకపోతే సమతుల వాతావరం దెబ్బతింటుందని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఆదివారం నాడు తిరుమలగిరిలోని తన నివాసంలో మిథాలీ రాజ్ మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో బాగుందని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు.
మొక్కలు నాటిన అనంతరం మిథాలీ రాజ్ వాటితో సెల్ఫీలు దిగారు. వాతావరణం కలుషితమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఉద్యమంలా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని ఆమె అన్నారు. కాలంలో మార్పుల మూలంగా పర్యావరణ పరిస్థితులు కూడా మారాయని మిథాలీ రాజ్ పేర్కొన్నారు. ప్రజలందరూ మొక్కలు నాటేందుకు కృషి చేయాలని ఆమె కోరారు. ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి తాను ఈ మొక్కలు నాటినట్లు వెల్లడించారు. అందరూ మొక్కలు నాటడం వల్ల పచ్చదనం పెరిగి కాలుష్యం తగ్గుతుందన్నారు. మొక్కలు నాటడం వల్ల రాబోయే తరాల వారికి పర్యావరణం విషయంలో కాపాడినవారము అవుతాము అని ఆమె పేర్కొన్నారు.
బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, క్రీడా జర్నలిస్టు బోరియా మజూందర్, పారిశ్రామికవేత్త వాణి కోలా, హీరోయిన్ కాజల్ అగర్వాలకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ, కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఇప్పటికే ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌లో ఎందరో ప్రముఖులు మొక్కలు నాటుతున్నారు. అనంతరం మరికొందరు మొక్కలు నాటాలని సూచిస్తున్నారు.