ఆటో డ్రైవర్ తో మైనర్ బాలిక ప్రేమ వ్యవహారం

By రాణి  Published on  28 Feb 2020 9:07 AM GMT
ఆటో డ్రైవర్ తో మైనర్ బాలిక ప్రేమ వ్యవహారం

పదమూడేళ్ల వయసున్న బాలిక తెలిసీ తెలియని వయసులో ప్రేమ మోజులో పడింది. క్రమంగా ప్రియుడి మోజులో పడి అసలు చదువును పట్టించుకోవడం మానేసింది. ప్రకాశంజిల్లా త్రిపురాంతకంకు చెందిన మైనర్ బాలిక తల్లిదండ్రుల వద్దే ఉంటూ స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. పాఠశాలకు వెళ్తున్న క్రమంలో ఆమె ఒక ఆటోడ్రైవర్ ప్రేమలో పడింది. తన వద్ద సెల్ఫోన్ కూడా ఉండటంతో దాని వాడకం కాస్తా ఎక్కువైంది.

కూతురు ఎక్కువ సేపు మొబైల్ తోనే గడుపుతూ..చదువును పట్టించుకోకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. అయినా ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. రోజుల తరబడి ఆటో డ్రైవర్ తో ఛాటింగ్ చేసింది. నెలరోజుల క్రితం ఆమె తన ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా..షాకైన వారు తెలిసీ తెలియని ప్రాయంలో ప్రేమేమిటని చివాట్లు పెట్టారు. బుద్ధిగా చదువుకోవాలని సూచించారు. అయినా ఆటోడ్రైవర్ తో ప్రేమాయణం మానకపోవడంతో విజయవాడలోని భవానీపురంలో ఉండే మేనత్త వద్దకు పంపించారు. కూతురితో మాట్లాడేందుకు ఫోన్ కావాలి కాబట్టి ఆ ఫోన్ ను ఆమె వద్దే ఉంచారు.

విజయవాడకు పంపినా మెసేజ్ లు మాత్రం ఆపలేదు. ఈనెల 25వ తేదీన బాలిక అత్త పనిమీద బయటికి వెళ్లగా..అదే అదనుగా భావించి ఆటో డ్రైవర్ తో వెళ్లిపోయింది. కాసేపటికి ఇంటికొచ్చిన అత్త..మేనకోడలు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికింది. బంధువులను ఆరా తీసినా ఆచూకీ తెలియకపోవడంతో..విషయం తల్లిదండ్రులకు చెప్పింది. వారు భవానీపురంలో కేసు పెట్టగా..పోలీసులు బాలిక సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆచూకీ కనుగొన్నారు. కౌన్సిలింగ్ ఇచ్చి బాలికను తల్లిదండ్రులకు అప్పజెప్పారు. మరోసారి బాలికను ప్రేమ పేరుతో మభ్యపెట్టినా, మాట్లాడినా జైలుకు పంపిస్తామని ఆటోడ్రైవర్ ను హెచ్చరించారు.

Next Story
Share it